BV Nagarathna Comment : తీర్పు సంచలనం ‘జస్టిస్’ కలకలం
జస్టిస్ బీవీ నాగరత్న కామెంట్స్ కలకలం
BV Nagarathna Comment : దేశ వ్యాప్తంగా నోట్ల రద్దుకు సంబంధించి తీర్పు వెలువడింది. నవంబర్ 8, 2016 అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో సంచలన ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఆయన చేసిన ఆ ఒక్క ప్రకటనతో దేశంలో చెలామణిలో ఉన్న రూ. 10 లక్షల కోట్ల రూపాయలు చెల్లుబాటు కాకుండా పోయాయి.
దీనికి ప్రధాన కారణం చెప్పింది ఏమిటంటే రూ. 1,000, రూ. 500 నోట్ల కారణంగా అవినీతి పేరుకు పోయిందని, బ్లాక్ మనీని బయటకు తీసుకు వస్తామని, పన్ను ఎగవేత దారుల ఆట కట్టించేందుకు వీటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ఈ కీలక ప్రకటన దేశ చరిత్రలో ఓ సంచలనం రేపింది.
కోట్లాది మంది ప్రజలు రోడ్ల పాలయ్యారు. ధర్నాలు చేశారు. నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాటి స్థానంలో తీసుకు వచ్చిన రూ. 2,000 నోట్లు చెలామణిలోకి వచ్చాయి. కానీ నరేంద్ర మోదీ(PM Modi) భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది.
ఈ నోట్లతో మరింత అవినీతి పెరిగింది. హవాలా రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ప్రస్తుతం ఎక్కడ పట్టుబడినా ఈ నోట్లే లభిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఒక రకంగా చెప్పాలంటే అస్తవ్యస్తంగా మారింది.
బడా బాబులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు నోట్ల రద్దు కల్పతరువుగా మారగా సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు , కూలీలు, కర్షకులు, ఇతర అసంఘటిత రంగాలకు చెందిన వారికి శాపంగా మారింది. ఉపాధి కరువైంది. బతుకు బరువైంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగింది.
ఇప్పటి వరకు ఆనాటి ప్రకటన చేసిన నాటి నుంచి ఆర్తిక రంగం ఇంకా కుదురుకోలేదు. దీంతో మోదీ చేసిన నోట్ల రద్దు ప్రకటనను సవాల్ చేస్తూ ఏకంగా భారత దేశ సర్వోన్నత న్యాయస్థానంలో 58 పిటిషన్లు దాఖలయ్యాయి.
తుది తీర్పు జనవరి 2 సోమవారం వెలువడింది. మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. వీరిలో నలుగురు న్యాయమూర్తులు మోదీ ప్రభుత్వానికి వత్తాసు పలికారు. కానీ మరొకరు మాత్రం భిన్నంగా స్పందించారు. ఆమె ఎవరో కాదు కర్ణాటకకు చెందిన ప్రధాన న్యాయమూర్తి బీవీ నాగరత్న.
ఈ సందర్భంగా 4-1 తేడాతో తీర్పు ప్రధానికి అనుకూలంగా వచ్చినా ఒకరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాదు జస్టిస్ బీవీ నాగరత్న ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దీనిపై చర్చ కొనసాగుతోంది. ఆమె తండ్రి ఒకప్పుడు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఆయనే వెంకట్రామయ్య. కర్నాటక లోని మాండ్యా జిల్లా పాండవపురంలో పుట్టారు.
ఇక తీర్పు సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న(BV Nagarathna) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్లమెంట్ లో ఎందుకు చర్చించ లేదంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు అంశాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆ చర్య చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.
నోట్ల రద్దు నిర్ణయం ఆర్బీఐ తీసుకోవాలి ప్రధాని కాదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు అంశం చట్టం పరిధిలో జరగలేదు. అది అధికారంతో జరిగింది.
అందుకే దానిని నేను చట్ట వ్యతిరేక నిర్ణయమని అభిప్రాయ పడుతున్నట్లు కుండ బద్దలు కొట్టారు జస్టిస్ బీవీ నాగరత్న(BV Nagarathna). అమలు చేసిన తీరు పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని , ఇది రాచరిక వ్యవస్థను గుర్తుకు తెస్తుందని చురకలు అంటించారు.
ఏది ఏమైనా న్యాయ వ్యవస్థలో ఇవాళ తీర్పు అనుకూలంగా వచ్చి ఉందని కొందరు సంతోషంతో ఉండవచ్చు..కానీ భిన్నమైన అభిప్రాయానికి కూడా అంతే విలువ ఉంటుందని మరిచి పోకూడదు.
Also Read : సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టు