Wrestling To Cricket Comment : క్రీడా లోకం వేధింపుల పర్వం
మహిళా రెజ్లర్లతో మరోసారి
Wrestling To Cricket Comment : సమున్నత భారత దేశంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. మిగతా క్రీడలు ఎలా ఉన్నప్పటికీ క్రికెట్ , టెన్నిస్ , హాకీ , ఇతర క్రీడలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
తాజాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు. వెంటనే తొలగించాలని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగారు. ఇదిలా ఉంటే గతంలో చాలా ఆరోపణలు వివిధ క్రీడా విభాగాలలో చోటు చేసుకున్నాయి.
వాటిని పరిశీలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఎప్పుడైతే రాజకీయాలు క్రీడా లోకంలోకి ఎంట్రీ ఇచ్చాయో ఆనాటి నుంచి విమర్శలు, అనుమానాలు నెలకొన్నాయి.
అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు భారతీయ క్రీడలను కుదిపి వేశాయి. ఇందుకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి.
ప్రపంచ వ్యాప్తంగా పలు టోర్నీలలో పతకాలు సాధించి దేశానికి గర్వ కారణంగా నిలిచిన వినేష్ ఫోగట్ , పూనియా, సాక్షి మాలిక్ , తో పాటు 30 మంది రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో ఒక్కసారిగా క్రీడా లోకంలో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. చివరిది అవుతుందని అనుకోలేం. తాజాగా హర్యానా మంత్రి సందీప్ సింగ్ పై ఓ మహిళా కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు చేసింది.
దీంతో విచారణకు ఆదేశించింది సర్కార్. పరిశీలిస్తే భారత క్రీడా రంగంలో ఇలాంటి విమర్శలు కోకొల్లలుగా ఉన్నాయి. భారత అండర్ -17 మహిళల ఫుట్ బాల్ జట్టు అసిస్టెంట్ కోచ్ అలెక్స్ ఆంబ్రోస్ పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
యూరప్ టూర్ లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించడంతో ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కి ఫిర్యాదు చేయడంతో తొలగించారు. కానీ తిరిగి అతడినే తీసుకుంది.
జూన్ 2022లో స్లోవేనియాలో జరిగిన విదేశీ శిక్షణా శిబిరంలో జాతీ జట్టు చీఫ్ కోచ్ ఆర్కే శర్మ అనుచిత ప్రవర్తన గురించి ఓ మహిళా స్లైక్లిస్ట్ ఫిర్యాదు చేసింది.
ఇక జూలై 2021లో 7 మంది మహిళా అథ్లెట్లు తమిళనాడు కోచ్ పి. నాగరాజన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ వాపోయారు. మహిళా క్రికెటర్ పై వేధింపులకు పాల్పడినందుకు గౌతమ్ గంభీర్ పై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు.
జనవరి 2020లో ఆగ్నేయ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మహిళా క్రికెటర్ పై ఆమె కోచ్ వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. మరో వైపు మహిళా జిమ్నాస్ట్ తనను అసభ్యకరంగా దూషించాడంటూ ఫిర్యాదు చేసింది కోచ్ పై.
సెప్టెంబర్ 2014లో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శిక్షణ శిబిరంలో కోచ్ మనోజ్ రాణా, సహచర జిమ్నాస్ట్ చందన్ పాఠక్ తనపై లూజ్ కామెంట్స్ చేశారంటూ ఆరోపించింది.
తమిళనాడు రాష్ట్ర అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. మార్చి 2011లో తనను ఎంపిక చేసేందుకు కోరిక తీర్చాలంటూ కోచ్ వేధించాడంటూ ఆరోపించింది.
2009లో సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ లో కాంస్య పతకం గెలుపొందిన 24 ఏళ్ల తులసి అసోసియేషన్ సెక్రటరీ ఎకే కరుణారన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది. ఈ మేరకు సిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.
జూలై 2010లో భారత మహిళల జట్టు కోచ్ మహారాజ్ కిషన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు హాకీ జట్టు సభ్యురాలు ఆరోపించింది.
2009లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వి. చాముండేశ్వరినాథ్ తనను ఎంపిక చేసేందుకు కోరిక తీర్చమని కోరాడంటూ మహిళా క్రికెటర్ ఆరోపించింది.
ఆర్టీఐ డేటా ప్రకారం 2010 నుండి 2020 దాకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లైంగిక వేధింపుల గురించి 45 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 29 కోచ్ లకు వ్యతిరేకంగా ఉన్నాయి.
కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు(Wrestling To Cricket) . ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి..మహిళా క్రీడాకారుల పట్ల జాగ్రత్తగా ఉండేలా చర్యలు చేపట్టాలి.
Also Read : ధిక్కార స్వరం ఫోగట్ కు సలాం