Anurag Thakur : నేతాజీని చూసి ఆంగ్లేయులు భ‌య‌ప‌డ్డారు

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్స్

Anurag Thakur : ఆనాడు ఆంగ్లేయులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను చూసి భ‌య‌ప‌డ్డార‌ని అన్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. జ‌న‌వ‌రి 23న నేతాజీ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బెంగాల్ గ‌డ్డ ఎంతో ప‌విత్ర‌మైన‌ద‌ని కొనియాడారు. ఈ నేల మీద ఎన్నో ఉద్య‌మాలు, పోరాటాలు కొన‌సాగాయ‌ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు జాతీయ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన ఘ‌న‌త ఈ ప్రాంతానికి చెందిన నాయ‌కుల‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) .

స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డేందుకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ తో స‌మాన‌మైన ఇండియ‌న్ సివిల్ స‌ర్వీసెస్ నుంచి ఎలా నిష్క్ర‌మించారో గుర్తు చేసుకున్నారు.

కోల్ కతాలో జ‌రిగిన యువ ఉత్స‌వ్ 2023లో పాల్గొని యువ‌త‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) . సుభాష్ చంద్ర బోస్ జీవితం కోట్లాది మంది భార‌తీయుల‌కు ఆద‌ర్శ ప్రాయ‌మ‌ని పేర్కొన్నారు.

ఆయ‌న అన్ని సౌక‌ర్యాల‌ను కాద‌నుకున్నారు. ఈ దేశం ఆంగ్లేయుల నుంచి విముక్తి క‌లిగించేందుకు అసాధార‌ణ‌మైన రీతిలో పోరాటం సాగించార‌ని కొనియాడారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి.

ఆనాడు జ‌రిగిన ఉద్విగ్న‌మైన పోరాటంలో మ‌హాత్మా గాంధీని చూసి బ్రిటిష‌ర్లు భ‌యానికి లోను కాలేద‌ని కానీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను చూసి వ‌ణికి పోయార‌ని పేర్కొన్నారు అనురాగ్ ఠాకూర్. నేతాజీ జీవితం మ‌నంద‌రికీ స్పూర్తి దాయ‌కం కావాల‌ని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి.

Also Read : స‌హ‌కారం సాంకేతిక నైపుణ్యం అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!