Layoffs Comment : కొలువులకు తాళం బతుకులు దుర్భరం
డాలర్ల కలల బేహారులకు అన్నీ చిక్కులే
Layoffs Comment : కలలన్నీ కల్లలు అవుతున్నాయి. స్వప్నాలన్నీ కళ్ల ముందే కూలి పోతున్నాయి. బతుకుపై భరోసా పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్న వేలాది మంది ఆశలు ఆవిరి అయి పోతున్నాయి. ఆర్థిక మాంద్యం పేరుతో కంపెనీలన్నీ తొలగించే బాట పట్టాయి.
ఒక రకంగా మరోసారి కరోనాను గుర్తుకు తెస్తున్నాయి. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , ఈ కామర్స్ , మీడియా..ఇలా ప్రతి రంగంలోనూ లే ఆఫ్స్(Layoffs) కంటిన్యూ అవుతున్నాయి. వీటిని తప్పు పట్టలేం.
ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన , ఆధారమైన ఆహారాన్ని పక్కన పెట్టేశాం. కేవలం ఇంటర్నెట్ , కంప్యూటర్ , ఐటీనే నమ్ముకుని ముందుకు సాగుతున్నాం. అందుకే ఇంతటి ఇబ్బంది.
ఒక్కసారి ఆశల పల్లకీలో ఊరేగుతున్న వాళ్లకు, డాలర్ల జపం చేస్తున్న వాళ్లకు, అదే మాయలో పడి కొట్టుకు చస్తున్న వాళ్లకు జీవితం ఇప్పుడు మిస్టరీగా మారుతోంది.టెక్నాలజీ అత్యంత ప్రమాదకరమైనది. అంతకంటే గొప్పది కూడా. దానిని కాదనలేం.
కొత్త నీరు చేరుతుంటే పాత నీరు పోవాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, రోబోటిక్ టెక్నాలజీ , డేటా సైన్స్ ఇలా కొత్త పేర్లు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
కానీ దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగుల లేదా మనుషుల ప్రమేయం లేకుండానే అన్ని పనులు చేసేలా ప్లాన్ చేస్తున్నాయి.
అందులో భాగంగానే కాస్ట్ కటింగ్ అని ముద్దు పేరు పెట్టి చావు కబురు చల్లగా చెబుతున్నాయి. చేతుల్లో పింక్ స్లిప్పులు ఇస్తున్నాయి. కొలువులను తీసి వేయడంలో ఆయా కంపెనీలు పోటీ పడుతున్నాయి. వేలాదిగా తీసి వేస్తున్నాయి.
కొన్ని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఒకే ఉద్యోగానికి అలవాటు పడిన వారంతా నానా తంటాలు పడుతున్నారు.
ఒక రకంగా ఆర్థిక మాంద్యం ఏమిటో కానీ కొలువుల మాంద్యం దెబ్బకు ఎంతో మంది పిచ్చివాళ్లు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట ఎలోన్ మస్క్ శ్రీకారం చుట్టాడు. ట్విట్టర్ ను టేకోవర్ చేశాక 9 వేల మందికి పైగా తొలగించాడు.
ఆ తర్వాత మైక్రో సాఫ్ట్ , ఫేస్ బుక్ , గూగుల్ , అమెజాన్ , సిస్కో , సేల్స్ ఫోర్స్ , స్పాటిఫై ,తదితర కంపనీలన్నీ ఇప్పటి వరకు 80 వేల దాకా ఉద్యోగులను సాగనంపాయి.
బ్లూబ్ బెర్గ్ నివేదిక ప్రకారం 2019 నుండి భారీ ఎత్తున తొలగిస్తూనే ఉన్నాయి కంపెనీలు. వీటితో పాటు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) 3,900 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
జర్మనీకి చెందిన సాఫ్ట్ వర్ కంపెనీ శాప్ ఎస్ఈ 3,000 మంది జాబర్స్ ను సాగనంపనున్నట్లు(Layoffs) వెల్లడించింది. ఆమ్ స్టర్ డామ్ కు చెందిన ఇ కామర్స్ కంపెనీ ప్రోసస్ ఎన్ వీ 30 శాతానికి పైగా తొలగించేందుకు శ్రీకారం చుట్టి.
అమెరికాకు చెందిన 3ఎం కంపెనీ 2,500 మందికి మంగళం పాడింది. సేల్స్ ఫోర్స్ కంపెనీ ఏకంగా 8,000 మందికి చెక్ పెట్టింది. కంపెనీకి సంబంధించి 23 ఏళ్ల కాలంలో ఇదే అతి పెద్ద తొలగింపు కావడం విశేషం.
గూగుల్ 12,000 మందిని, ఫేస్ బుక్ మెటా 10, 000 వేల మందిని , మైక్రో సాఫ్ట్ 10, 000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక ప్రముఖ దిగ్గజ ఇకామర్స్ కంపెనీ అమెజాన్ 18,000 మందిపై వేటు వేసింది.
ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది కంపెనీలు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికైనా ఉద్యోగులు, నిపుణులు అత్యాశకు పోవడం మానేసి సింపుల్ గా జీవించడం నేర్చుకుంటే బతుకు దుర్భరం కాదన్నది గుర్తించాలి.
Also Read : రాజ్యాంగం ప్రజా దేవాలయం