Vani Jayaram Comment : మూగ బోయిన ‘కోయిల‌’

ఆ గాత్రం అజరామ‌రం

Vani Jayaram Comment : దేవుడు ఒక్కోసారి న‌వ్విస్తాడు..అంత‌లోనే ఏడిపిస్తాడు. ఒక‌రి వెంట మ‌రొక‌రు వెళ్లి పోతున్నారు. ఈ లోకాన్ని వీడుతున్నారు. ఆ మ‌ధ్య‌న క‌రోనా భూతం గాన గంధ‌ర్వుడిని కాటేసింది. మా అన్న‌య్య వెళ్లిపోయాడంటూ సీతారాముడు లోకాన్ని వీడాడు.

ఇక నేను ఉండ‌లేను..స్వర్గంలో పాడేందుకు వెళ్లిపోతానంటూ సెల‌వు తీసుకుంది..కోకిల‌మ్మ ల‌తా మంగేష్క‌ర్. ఇప్పుడు మ‌నంద‌రిని విషాద సాగ‌రంలో ముంచేసి వెళ్లి పోయింది గాయ‌ని కోయిల‌మ్మ వాణీ జ‌య‌రాం(Vani Jayaram) .

ఏదో ఒక రోజు పోవాల్సిందే..ఈ ప్ర‌పంచం నుంచి నిష్క్ర‌మించాల్సిందే. కానీ కొంద‌రు వెళ్లిపోతే వాళ్ల జ్ఞాప‌కాలు మ‌న‌ల్ని ఓ ప‌ట్టాన ఉండ‌నీయ‌వు. కంట త‌డి పెట్టిస్తాయి. గుండెల్ని గాయం చేస్తాయి. 

ఈ అంతులేని ప్ర‌యాణంలో అలాంటి గొంతులు వెంటాడుతాయి. లాలిస్తాయి. మైమ‌రిచి పోయేలా చేస్తాయి. ఆ అద్భుత స్వ‌రం వాణీ జ‌య‌రాంది. 

కె. బాల చంద‌ర్ పుణ్య‌మా అని ఎంద‌రో సినీ వెండి తెర మీద త‌ళుక్కున మెరిశారు. వారిలో ఆమె కూడా ఒక‌రు. ఆ త‌ర్వాత కాశీనాథుని విశ్వ‌నాథుడు ఆమెను ప్రోత్స‌హించాడు.

మూడు జాతీయ పుర‌స్కారాలు అందుకుంటే ఆయ‌న చేసిన సినిమాల్లోని రెండు సినిమాల‌కు అవార్డులు అందాయి వాణి జ‌య‌రాంకు. క‌ళాకారుల‌కు స‌త్కారాలు, స‌న్మానాల కంటే ఆద‌రాభిమానాలు, చ‌ప్ప‌ట్లు, జేజేలు ఎక్కువ‌గా ఆనందాన్ని ఇస్తాయి.

అవి క‌డుపులు నింప‌క పోవ‌చ్చు..కానీ ఓ పొగ‌డ్త మ‌నిషిని ఇంకా ఇంకా పాడేలా..రాసేలా..న‌టించేలా చేస్తుంది. 1971లో త‌న పాట‌ల ప‌ల్ల‌కీలోకి ప్ర‌వేశించింది వాణీ జ‌య‌రాం. 19 భాష‌ల‌లో వేల పాట‌లు పాడింది.

ఎన్నో ఎన్న‌ద‌గినవి..అంత‌కంటే క‌ల‌కాలం గుర్తు పెట్టుకునే పాట‌లు ఎన్నో..మ‌రెన్నో. సినిమా పాట‌లే కాదు భ‌క్తి గీతాలు కూడా పాడి ప‌ర‌వ‌శించేలా చేసింది. క‌ర్ణాట‌క సంగీతాన్ని అవ‌పోస‌న ప‌ట్టింది.

అన్నింటికంటే ఆ గాత్రంలో మాధుర్య‌మే కాదు అమిత‌మైన వాత్స‌ల్య పూరిత‌మైన ఆనందం దాగి ఉంటుంది. అందుకే ఎంత‌టి ఉద్విగ్న‌త‌కు లోనైనా ప్ర‌శాంత‌త అనే ఒడి లోకి జారి పోతాం. 

ఆ గొంతులో అమృతం దాగి ఉంది. అందుకే ఇన్నేళ్ల దాకా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటూ.. కాపాడుకుంటూ..పాడుతూ వ‌చ్చింది వాణీ జ‌య‌రాం. చిన్న‌ప్ప‌టి నుంచే సంగీతం అంటే ఇష్టం.. అదే ఆమెను గాయ‌నిని చేసింది.  

క‌ర్ణాట‌క సంగీతం శ్రీ‌నివాస అయ్యంగార్ , టీఆర్ బాల సుబ్ర‌మ‌ణియ‌న్ , ఆర్ ఎస్ మ‌ణి వ‌ద్ద నేర్చుకుంది. హిందూస్తానీ సంగీతం ఉస్తాద్ ర‌హ్మాన్ ఖాన్ వ‌ద్ద 

అభ్య‌సించింది. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు..

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, హిందీ..ఇలా ఎన్నో భాష‌ల‌లో పాడింది..ప‌రవ‌శింప చేసింది వాణీ జ‌య‌రాం. ఇక తెలుగు వారంద‌రికీ ఆస్థాన గాయ‌కురాలిగా మారి పోయింది ఈ కోయిల‌మ్మ‌(Vani Jayaram) .

స్వాతి కిర‌ణం, అంతులేని క‌థ‌, మ‌రో చ‌రిత్ర‌, ఆరాధ‌న‌, శ్రుతి ల‌య‌లు, సీతాకోక చిలుక‌, ఇది క‌థ కాదు లాంటి సినిమాలు ఆమె పాట‌కు గుర్తులు.

ఇక సెల‌వంటూ వెళ్లి పోయిన ఆ కోయిలమ్మ ఇక ప‌లుక‌దు. మ‌న కోసం పాడ‌దు. ల‌తాతో క‌లిసి పాట‌లు పాడేందుకు వెళ్లి పోయింది వాణీ జ‌య‌రాం.

Also Read : క‌న్నీళ్ల‌ను మిగిల్చిన క‌ళాత‌ప‌స్వి

Leave A Reply

Your Email Id will not be published!