Gundappa Viswanath : విశ్వనాథుడు మణికట్టు మాంత్రికుడు
ఫబ్రవరి 12న గుండప్ప పుట్టిన రోజు
Gundappa Viswanath : భారతీయ క్రికెట్ చరిత్రలో చెరపలేని అధ్యాయం గుండప్ప విశ్వనాథ్. ప్రపంచ క్రికెట్ లో కళాత్మకమైన ఆట తీరుతో ఆకట్టుకున్న వారిలో కొందరే. వారిలో పాకిస్తాన్ కు చెందిన జహీర్ అబ్బాస్ , ఇంగ్లండ్ కు చెందిన డేవిడ్ గోవర్ , భారత్ కు చెందిన గుండప్ప విశ్వనాథ్ , మహ్మమద్ అజహరుద్దీన్ , వంగీపురం వెంకట సాయి లక్ష్మణ్ ఉన్నారు. ఇవాళ ఫిబ్రవరి 12కు ఎంతో ప్రత్యేకత ఉంది.
ఎందుకంటే ఇదే రోజు క్రికెట్ ను సుసంపన్నం చేసిన గుండప్ప విశ్వనాథ్ పుట్టిన రోజు. ఆయనకు ఇప్పుడు 72 ఏళ్లు. బంతుల్ని కళాత్మకంగా పరుగులుగా మల్చడంలో ఆయనకు ఆయనే సాటి. గుండప్ప విశ్వనాథ్ కు మరో పేరు కూడా ఉంది విషీ అని. విశ్వనాథ్ చివరి టెస్టు మ్యాచ్ 1983లో కరాచీలో ఆడాడు.
విశ్వనాథ్ 1969 నుంచి 1983 వరకు 91 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. 25 వన్డే మ్యాచ్ లలో భారత్ తరపున ఆడాడు. స్టైలిష్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందాడు. తన కెరీర్ లో మొత్తం 6,080 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేలలో 493 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆనాటి క్రికెట్ లో బెల్లియప్ప, రాజగోపాల్ , వెంకట రాఘవన్ , దాల్వీ, కళ్యాణ సుందరం తో పాటు సుబ్రమణ్య, ప్రసన్న, చంద్రశేఖర్ ఉన్నారు. 1969లో కాన్పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో గుండప్ప విశ్వనాథ్(Gundappa Viswanath) సున్నాకే ఔట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో 137 రన్స్ చేసి సత్తా చాటాడు విషీ. ఇందులో 25 ఫోర్లు ఉన్నాయి. ఆయన అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. 1973లో బాంబే టెస్టులో ఇంగ్లండ్ కు చుక్కలు చూపించాడు..అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు.
అతడి కళాత్మకమైన షాట్స్ కు ప్రత్యర్థి జట్టు విస్తుపోయింది. ఆనాడు గుండప్ప విశ్వనాథ్ , సునీల్ గవాస్కర్ లలో ఎవరు గొప్ప అన్న చర్చ కూడా మొదలైంది. విచిత్రం ఏమిటంటే సన్నీ సోదరి కవితను పెళ్లి చేసుకున్నాడు గుండప్ప విశ్వనాథ్. ఇద్దరూ కలిసి భారత క్రికెట్ ను వెలిగించారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 145 రన్స్ చేసి తనకు ఎదురే లేదని చాటాడు విషీ.
స్క్వేర్ కట్ , స్క్వేర్ డ్రైవ్ విశ్వనాథ్ ట్రేడ్ మార్క్ . అంతే కాదు ఈడెన్ గార్డెన్ , లార్డ్స్ , మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లలో చేసిన సెంచరీలు ఆయన ఆట తీరుకు అద్దం పడతాయి. ఈ మణికట్టు మాంత్రికుడికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.
Also Read : ఇండియా పాకిస్తాన్ బిగ్ ఫైట్