Pa Ranjith Comment : వెండి తెరపై ‘పా’ వేగు చుక్క
సెల్యూలాయిడ్ పై సంతకం
Pa Ranjith Comment : ప్రపంచాన్ని ఆవిష్కరించే అద్బుతమైన సాధనం..అంతకు మించిన ఆయుధం సినిమా. జీవితాన్ని ప్రతిఫలించేలా చేస్తుంది. మానవ సమూహపు భావోద్వేగాలను తెరపైకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఇది అంతులేని ప్రయాణం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ లోకపు వాకిట ఎందరో తమ సంతకాలను వదిలి వేసి వెళ్లారు.
ఇవాళ వాళ్లు లేక పోవచ్చు. కానీ వాళ్లు తీసిన చిత్రాలు నిత్యం కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. కదిలిస్తూనే ఉన్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా అంటే వ్యాపారం కాదని అది సమస్తాన్ని చెప్పే సాధనమని గుర్తు చేశారు.
అంతే కాదు చిత్రం కళని, కన్నీళ్లను, బతుకు లోని మర్మాన్ని, మార్మికత్వాన్ని, సమస్త సమస్యలను తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం ఎడ తెగకుండా చేస్తున్న వారిలో ఎన్నదగిన దర్శకులలో ముందు వరుసలో నిలుస్తున్నాడు తమిళ సినిమా రంగానికి చెందిన పా రంజిత్(Pa Ranjith) .
ఈ దేశాన్ని కులం చీల్చుతోందని , మనుషుల మధ్య అంతరాలను సృష్టిస్తోందని , సమస్త బాధలకు , అంతులేని మోయలేని దుఖాఃనికి ప్రధాన కారణం ఇదేనంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. అతడు తీసినవి కొన్ని సినిమాలే . కానీ ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన సినిమా మాత్రం కాలా. ఇందులో రజనీకాంత్ నటించాడు.
ఇది పక్కన పెడితే సమస్త సమాజం పట్ల , ఈ ప్రపంచం పోకడ పట్ల, అణగారిన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనను, ఆక్రందనలను తెర మీదకు తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు పా రంజిత్.
దర్శకుడు కూడా మన లాంటి..మనలోని మనిషే. మరి ఈ విద్వేషాలు ఎందుకు..ఇన్ని విభేదాలు..తార తమ్యాలు ఎందుకని ప్రశ్నిస్తాడు. బౌద్దాన్ని స్వీకరించిన అంబేద్కర్ ను అమితంగా ఇష్టపడే పా రంజిత్ ఆలోచనా తీరు భిన్నంగా ఉంటుంది.
అతడి కెమెరా లోకం చూడని అన్నింటిని చూపించే ప్రయత్నం చేస్తుంంది. అందుకే పా రంజిత్(Pa Ranjith) ను లోక నాయకుడు కమల్ హాసన్ మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. నేను చూసిన దర్శకులలో భిన్నమైన వ్యక్తి పా రంజిత్ అని పేర్కొన్నాడు.
నిత్యం సినిమా గురించే ఆలోచిస్తాడు..పడుకున్నా లేచినా మాట్లాడినా సరే చిత్రమే అతడి ప్రపంచం. అంతే కాదు తన జీవిత కాలంలో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది కళకు..పుస్తకాలకేనని ఇప్పటికే ప్రకటించాడు పా రంజిత్.
కర్కశమైన బతుకుని అర్థం చేసుకోవాలంటే వాటిని మించిన మార్గాలేవీ లేవంటాడు ఈ దర్శకుడు. అయితే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.ఆర్ట్
హౌస్ ను ఏర్పాటు చేశాడు. దానికి నీలం బుక్స్.. కల్చరల్ (సాంస్కృతిక) వేదికను ఆరంభించాడు. వేలాది పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
ఎవరైనా ..ఎప్పుడైనా రావచ్చు..చదువుకోవచ్చు..ఆలోచనలు పంచుకోవచ్చు. ఒక రకంగా బుద్ది జీవులకు, కళాకారులకు, కవులకు..రచయితలకు , దర్శకులు, టెక్నీషియన్లకు..పొలిటికల్ అనలిస్టులకు..విద్యార్థులకు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉండేలా చేశాడు పా రంజిత్.
మనిషి అన్నాక ఏదో ఒక ప్రయోజనం కోసం ఆశించి బతక కూడదంటాడు. కనీసం పది మందికి ఉపయోగ పడేలా ఉండక పోతే జీవించి ఏం లాభం అటాడు. ఏది ఏమైనా పా రంజిత్ ..వెండి తెరపై వేగు చుక్క కాదంటారా.
Also Read : కులమే నాకు రాజకీయ ప్రత్యర్థి – కమల్