Janasena Comment : జనసేన ప్రస్థానం ప్రభంజనం
మార్చి 14న ఆవిర్భావ వేడుకలు
Janasena Comment : ఏపీలో జనసేన హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఇటు తెలంగాణలో అటు ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. లక్షలాది మంది అభిమానులను కలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనపై అందరి కళ్లు ఉన్నాయి. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.
ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళుతున్నారు జనసేనాని. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం రావాలని, వనరులు అందరికీ పంచబడాలని , విద్య, వైద్యం, ఉపాధి దొరకాలనే నినాదాలతో ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్.అన్న మెగా స్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు.
ఆ తర్వాత పవర్ స్టార్ ఎవరూ ఊహించని రీతిలో జనసేన పార్టీని మార్చి 14, 2014లో ఏర్పాటు చేశారు. జనసేన(Janasena Comment) అనేది ప్రజా సైన్యం అర్థం వచ్చేలా దానిని పెట్టారు.
ఆనాడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసినా కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుపొందింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.
రాజకీయ చైతన్యం అన్నది ముఖ్యమని, ప్రజలు చైతన్యవంతం కానంత వరకు ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. కొన ఊపిరి ఉన్నంత దాకా తాను ప్రజల కోసం పని చేస్తానంటూ ప్రకటించాడు. తాను కోరితే పదవులు వస్తాయని కానీ రాష్ట్రం కోసం ఏ పదవిని ఆశించ లేదని స్పష్టం చేశారు.
పవన్ అంటే పోరాటం..ఉద్యమం..ప్రజా పక్షం అని ప్రకటించారు. గత ఏడాది మార్చి 14న తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. సభా వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టారు. 2024లో అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో ఇటు బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్నారు. ప్రజలను రక్షించు కునేందుకు, రాక్షస పాలన నుంచి కాపాడు కునేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్దమని ప్రకటించారు.
అవినీతి నిర్మూలనే తన అంతిమ లక్ష్యమన్నారు. అందుకే తాను చేగువేరాను అభిమానిస్తానని తెలిపాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడాన్ని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ . ఉద్దానంలో బాధితుల కోసం పోరాడాడు.
అయితే గత ఎన్నికల్లో రెండింట్లో పోటీ చేసిన ఆయన ఓడి పోయాడు. అయినా ఎక్కడా తగ్గలేదు. పోరాటమే ఊపిరిగా ముందుకే వెళుతున్నారు పవర్ స్టార్. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు.
ఆయనకు తోడుగా అపారమైన అనుభవం కలిగిన నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇద్దరూ కలిసి పార్టీని బలోపేతం చేయడంతో పాటు త్వరలో జరిగే ఎన్నికల యుద్దానికి సిద్దం అవుతున్నారు.
ఇదే సమయంలో ఎక్కడా తగ్గకుండా ప్రజా సమస్యలపై దండోరా ప్రకటించారు. మొత్తంగా ఏపీలో జనసేన పార్టీ(Janasena Comment) ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కాదనలేని సత్యం. ఏం జరుగుతుందో అనేది ఎన్నికల్లో తేలుతుంది. జనం ఎటు వైపు ఉన్నారనేది స్పష్టం అవుతుంది.
Also Read : హక్కుల కంటే ఐక్యత ముఖ్యం – పవన్