#DrugEffect : రోగి జన్యు నిర్మాణ వైవిధ్యతతోనే ఔషధ ప్రభావం…!
Drug effect with patient genetic variation ...!
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ, సిసియంబి తాజాగా బహిర్గత పరిచిన పరిశోధనా ఫలితాల్లో రోగిలోని జన్యు నిర్మాణానికి (వరుస క్రమానికి లేదా సీక్వెన్సింగ్) మరియు ఔషధ జీవక్రియ (డ్రగ్ మెటబాలిజమ్)కు సన్నిహిత సంబంధం ఉంటుందనే విషయాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘ఫార్మకోజీనోమిక్స్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్’లో ముద్రిత పరిశోధనా వ్యాసం ద్వారా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
మనిషి మనిషికి జన్యు వరుస క్రమ వైవిధ్యత ఉంటుందని, దాని నిర్మాణ విలక్షణతను బట్టే ఆ వ్యక్తి దేహంలో ఔషధ జీవక్రియ ఆధారపడి ఉంటుందని వివరించారు. రోగుల శరీరంలోని జన్యువులను (డీకోడింగ్) పరిశీలించి ఔషధ పని తీరును విశ్లేషించారు. వేరు వేరు రోగుల శరీరంలో ఒకే ఔషధం వైవిధ్య జీవక్రియకు లోనవుతుందని నిర్థారించారు. రోగిలోని సైటోక్రోమ్ – పి450 – 2సిఓ లేదా సివైపి2సి9 అనబడే జన్యువు వరుస క్రమాన్ని (సీక్వెన్సింగ్) బట్టి మాత్రమే వైద్యులు కచ్చితమైన ఔషధ మోతాదు (డోస్)ను నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. ఔషధ డోసులు రోగి రోగికి ఒకేలా ఉండవని అర్థం అవుతోంది.
అందరు రోగులకు ఒకే డోసును వాడడం సరైన చికిత్స కాదని, దీని వల్ల కొందరు రోగులకు ఔషధ మోతాదు అధికం లేదా తక్కువ కావచ్చు. జన్యు క్రమాన్ని బట్టి మోతాదు ఇవ్వని యెడల ఔషధ దుష్ప్రభావాలకు లేదా ప్రతికూల చర్యలకు రోగులు గురి కావలసి వస్తుందని తెలుస్తున్నది.
సిసియంబి చేసిన విస్తృత పరిశోధనల్లో 1,488 మంది భారతీయులను, 36 జన సమూహాలు, వివిధ భాషలు, కులాలు మరియు గిరిజన తెగల నుంచి ఎంపిక చేసి జన్యు నిర్మాణ వరుస క్రమాలను తెలుసుకుంటూ, వారి శరీరంలో ఔషధ జీవక్రియల మార్పులను నిర్థారించారు. భారతీయులతో పాటు 1,087 మంది దక్షిణ ఆసియా దేశాల ప్రజలను కూడా పరిశోధనల్లో వాడుకోవడం జరిగిందని సిసియంబి శాస్త్రజ్ఞులు తెలిపారు.
ఈ పరిశోధనల్లో దక్షిణ ఆసియాలో 8 రకాల సివైపి2సి9 జన్యు వరుస క్రమాలు కనిపించాయని, మెుత్తంగా 11 జన్యు నిర్మాణాలు బయట పడినట్లు అయ్యిందని తెలిపారు. పరిశోధనలకు వాడిన జన్యువుల్లో 20 శాతం మందికి ఔషధ జీవక్రియలో లోపాలు కనిపించాయని తేలింది. భవిష్యత్తులో వైద్యులు ఔషధాలను మరియు వాటి మోతాదులను రోగికి సిఫార్సు చేసే ముందు అతని జన్యువు సివైపీ2సీ9 నిర్మాణంలోని వరుస క్రమాన్ని తెలుసుకోవలసి ఉంటుందని వెల్లడైంది.
సిసియంబి విడుదల చేసిన తాజా పరిశోధనా ఫలితాల వల్ల రోగుల జన్యు నిర్మాణాలను బట్టి మాత్రమే వ్యక్తిగతంగా ప్రభావవంతమైన ఔషధ డోసును సుచించాల్సి ఉంటుందని తెలిపారు. భారతీయుల్లోని జన్యు సీక్వెన్సింగ్‌లో వైవిధ్యత కనిపిస్తున్నదని, కావున ఖచ్చితమైన ఔషధ మోతాదులు రోగులను బట్టి సిఫార్సు చేయాలని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు రోగి వయస్సు, లింగ మరియు బాడీ మాస్ ఇండెక్స్ (బియంఐ) ఆధారంగానే వైద్యులు ఔషధ మోతాదులు నిర్ణయించే పద్దతులు పాటించే వారు. ఈ పద్దతి అన్ని సందర్భాలలో అందరు రోగులకు ప్రభావాన్ని చూపదని తెలుసుకోవాలి.
అందరికీ ఒకే డోసును సూచించిన యెడల దురద, దద్దుర్లు, వాంతులు మరియు వికారం లాంటి దుష్ప్రభావాలు కొందరులో బయట పడతాయని తేలింది. కొందరి రోగుల్లో ఔషధం పని చేయని కారణంగా వైద్యులు మరో ఔషధాన్ని సిఫార్సు చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి రోగుల జన్యు వరుస క్రమంలో విలక్షణత వల్ల ఔషధం పని చేయక పోవడం లేదా ప్రతికూల ప్రభావాలను చూపడం జరుగుతుంది. రోగి శరీరంలో ఔషధం ఎంజైమ్‌ల సహాయంతో జీవక్రియలో విచ్ఛిన్నం కావడంతో దాని ప్రభావం రోగిలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ జన్యు నిర్మాణ వరుసలో తప్పనిసరిగా తేడా ఉంటుంది.
ఒకే వంశానికి లేదా కుటుంబ వృక్షానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహాలు (మేనరికాలు) జరగడం ఇండియాలో సర్వసాధారణం. ఇలాంటి వారిలో జన్యు వరసల్లో మార్పులు తక్కువగా ఉంటాయి. మూర్ఛ మరియు రక్తపోటుకు సంబంధించిన ఔషధాల జీవక్రియకు జన్యువు అవసరం అవుతుంది. ఇలాంటి జన్యు నిర్మాణ వరుసలో వ్యత్యాసంతో రోగి రోగికి ఔషధ డోసు మరియు పని తీరు మారుతూ, కొందరిలో ఔషధ జీవక్రియ మందగించడం లేదా ఔషధ విసర్జన రేటు తగ్గడం జరుగవచ్చని తేలింది.
ప్రపంచ జనాభా 750 కోట్లలో ఏ ఇద్దరు సర్వసమానం కాదు. ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉండవు. మనలోని ఈ వైవిధ్యతకు కారణం జన్యు పరమైన వరుస క్రమం లేదా సీక్వేన్సింగ్ వేరు వేరుగా ఉండటమే. మనిషి జన్యు స్వభావాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సమీప భవిష్యత్తులో జన్యు నిర్మాణాలను తెలుసుకొని ఔషధాలు సిఫార్సు చేసే వైద్య విప్లవం రానున్నది. ఈ నూతన ఆవిష్కరణలతో రోగులకు కచ్చితమైన ముందులు, డోసులు వాడాల్సిన అగత్యం ఏర్పడుతుంది.
జన్యు నిర్మాణ జ్ఞానం లేకుండా వైద్యులు మందులు సిఫార్సు చేస్తే, ఒక్కొక్కరిలో ఒకలా ఔషధ జీవక్రియ జరిగి వ్యాధి నయం కావచ్చు లేదా దుష్ప్రభావాలకు గురికావచ్చు. జన్యు నిర్మాణ ఆధార వైద్యవిధానం వెంటనే అమలులోకి రావాలని, దాని ఫలితంగా వైద్యరంగంలో సానుకూల మార్పులు వస్తాయని కోరుకుందాం
(సిసియంబి – హైదరాబాద్ పరిశోధనా వ్యాసం ఆధారంగా)
No comment allowed please