రఘురామ్ రాజన్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకు ఈ దేశం పట్ల, దేశ ఆర్థిక రంగం పట్ల ఎనలేని అవగాహన ఉంది. ప్రపంచ ద్రవ్య నిధి సంస్థకు చీఫ్ గా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా సేవలు అందించారు. ఎప్పుడైతే కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందో ఆ వెంటనే రాజన్ ను పక్కన పెట్టారు. ఇదే క్రమంలో నిరంతరం దేశ ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఇబ్బందుల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కానీ పాలక వర్గం పూర్తిగా వ్యాపారాత్మకంగా మారి పోయిందన్న విమర్శలు లేక పోలేదు. రాజన్ రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను పంచుకున్నారు. దేశాభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ఆర్బీఐ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి స్పష్టం చేశారు. కానీ పట్టించుకునే పరిస్థితిలో పాలక వర్గం లేదు. ఇప్పటికే అమెరికా లాంటి అభివృద్ది చెందిన అగ్ర రాజ్యంలో కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వచ్చిన ప్రధాన బ్యాంకులు రెండు దివాళా తీశాయి.
ఇది ఆ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి, ఆర్థిక రంగానికి చెంప పెట్టు. దీనిని ఉదహరించారు. 2008లో చోటు చేసుకున్న సంక్షోభం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రఘురామ్ రాజన్ . ఎందుకంటే ఆయన ఐఎంఎఫ్ కు ప్రాతినిధ్యం వహించారు. చీఫ్ ఎకానమిస్ట్ గా అపారమైన అనుభవం కలిగిన ఈ ఆర్థికవేత్త ఆవేదనలో అర్థం ఉంది.
ఇదిలా ఉండగా మరిన్ని బ్యాంకులు పతనం కాబోతున్నాయంటూ హెచ్చరించారు రాజన్. ఫెడ్ రేట్ల పెంపుదల నుండి మరింత అస్థిరత ఉత్పన్నం కాబోతోందంటూ పేర్కొన్నారు. ఇది ఒక రకంగా రెడ్ సిగ్నల్ అన్నమాట. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఇంకా కష్టాలు తీరలేదని తెలిపారు. ఒక దశాబ్దం పాటు లిక్విడిటితో మార్కెట్ ను ముంచెత్తిన ఈజీ మనీ తర్వాత దాని దూకుడు విధానం కఠినతరం చేయడంతో బ్యాంకింగ్ వైఫల్యాలను చలనంలో ఉంచినందుకు ఫెడరల్ రిజర్వ్ పై నిందలు మోపారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థపై చేసిన ఈ ప్రధాన వ్యాఖ్యలు భారత దేశానికి ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వర్తిస్తుంది. ఏది ఏమైనా రఘురామ్ రాజన్ చేసిన ఈ హెచ్చరిక ఓ గుణపాఠం కావాలి.