ఈ దేశంలో మహాత్ముడు అనే సరికల్లా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గుర్తుకు వస్తాడు. కానీ అంతకంటే ముందు మహాత్ముడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు మహాత్మా జ్యోతిబా పూలే. భారత దేశానికి వెలుగులు పంచిన వాడు. మహోన్నత మానవుడు. సమున్నత భారతీయపు నేల మీద నడిచిన గొప్ప వ్యక్తి. అంతకు మించిన సంఘ సంస్కర్త. జ్యోతిబా పూలే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ దేశానికి 75 ఏళ్లయింది స్వేచ్చ లభించి. ఇప్పటికీ ఎప్పటికీ..ఎల్లప్పటికీ ..ఈ లోకంలో సూర్య చంద్రులు ఉన్నంత దాకా నిలిచే ఉంటాడు పూలే.
ఇవాళ ఆయన జయంతి. సత్య శోధక్ సమాజ్ ను స్థాపించారు. దోపిడీకి గురైన కులాల వ్యక్తులకు సమాన హక్కులు సాధించడం ఈ సమాజ సేవక్ లక్ష్యం. జ్యోతిబా పూలే కూడా ఆడ శిశు హత్యల వంటి సమస్యలపై తన స్వరం పెంచారు. ప్రతి ఏటా ఏప్రిల్ 11 న పూలేను స్మరించుకుంటారు. నేటికీ ఇవాళ లేక పోయినా కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారు. ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఈ దేశంలో లెక్కలేనంత మంది గురువులు, మేధావులు, విద్యావంతులు, విద్యావేత్తలు , ఆలోచనాపరులు ఉన్నారు. కానీ నేటికీ సమున్నత శిఖరంలా నిలబడ్డారు జ్యోతిబా పూలే.
1827లో మరాఠా లోని సతారా జిల్లాలో పుట్టాడు. సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక కార్యకర్త, ఆలోచనా పరుడు, రచయిత పూలే. విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు తన జీవితాన్నిఅంకితం చేశాడు. 1880లో అంటరానివారిని, సమాజంతో అణచి వేయబడిన బహిష్కరణకు గురైన వారిని దళిత అనే మరాఠీ పదాన్ని ఉపయోగించాడు. 1848లో తన భార్య సావిత్రా బాయి పూలేతో కలిసి పూణేలో బాలికల కోసం దేశంలోనే తొలిసారిగా బడిని ప్రారంభించారు. జ్యోతిబా పూలే మొదటి వ్యక్తి కావడం విశేషం. ఇది చరిత్ర విస్మరించని సత్యం. ఇది భారత దేశంలో మహిళా విద్యకు విప్లవాత్మక అడుగు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రచారం కూడా చేపట్టారు జ్యోతిబా పూలే.
తన అనుచరులతో కలిసి సత్య శోధన సంఘం స్థాపించారు. దోపిడీకి గురైన కులాల వ్యక్తులకు సమాన హక్కులు సాధించడం సమాజ లక్ష్యం అని ప్రకటించాడు. చదువు ముఖ్యమని, ఆడ పిల్లలకు స్వేచ్ఛ అవసరమని నినదించాడు. ఈ సందర్బంగా జ్యోతి బా పూలే చేసిన వ్యాఖ్యలు ఎల్లకాలం గుర్తుంచు కోవాల్సినవే కావడం విశేషం. విద్య లేకుంటే జ్ఞానం పోయింది. వివేకలం లేకుండా నైతికత కోల్పోయింది. నీతి లేకుండా అభివృద్ది పోయింది. అభివృద్ది లేకుండా సంపద పోయింది. సంపద లేకుండా శూద్రులు నాశనం అయ్యారు. ఇదంతా విద్య లేక పోవడం వల్ల చాలా జరిగిందని కుండ బద్దలు కొట్టారు.
బ్రాహ్మణులు నిజంగా ఈ దేశంలోని ప్రజలను ఏకం చేసి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటే మొదట వారు తమ క్రూరమైన మతాన్ని వదిలి వేయాలని పిలుపునిచ్చాడు. అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నాడు మహనీయుడు జ్యోతి బా పూలే. పూలే ఒక వ్యక్తి కాదు దేశానికి దిక్సూచి.