RS Praveen Kumar : ఒకే రోజు పరీక్షలపై ఆర్ఎస్పీ ఫైర్
పరీక్షలకు గ్యాప్ ఉండాలని డిమాండ్
RS Praveen Kumar : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పాలన గాడి తప్పిందని, మరో వైపు లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పరీక్షలు నిర్వహిస్తే ఆయా పరీక్షలకు సంబంధించి రోజు విడిచి రోజు లేదా కొన్ని రోజుల తేడాలో నిర్వహిస్తారని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలా జరగడం లేదని ఆరోపించారు.
పాలకులకు షెడ్యూల్ ఉంటుందని కానీ పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు రాసే పరీక్షలకు ఎందుకు గ్యాప్ పాటించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి దుందుడుకు నిర్ణయాల వల్ల , పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 30న తెలంగాణలో ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఇది ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) . ఆ ఒక్క రోజే పోలీస్ కానిస్టేబుల్ , కమ్యూనికేషన్ కానిస్టేబుల్ , జూనియర్ లైన్ మెన్ అన్నింటికీ పరీక్షలు ఉన్నాయని ఎలా రాస్తారంటూ నిలదీశారు.
రాష్ట్రంలో పాలన ఎలా ఉందో దీనిని బట్టి చూస్తే అర్థం అవుతుందని బీఎస్పీ చీఫ్ పేర్కొన్నారు. ఇకనైనా పరీక్షలను గ్యాప్ ఉండేలా నిర్వహించాలని కోరారు. లేకపోతే బాధితుల తరపున పోరాడుతామని హెచ్చరించారు.
Also Read : నిలకడగా కందూరు జానారెడ్డి ఆరోగ్యం