Karnataka BJP Comment : కన్నడ ‘కమలం’లో జాబితా కల్లోలం
అభ్యర్థుల ఎంపిక గందరగోళం
Karnataka BJP Comment : భారత దేశంలో ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీకి ఎదురే లేదు. ఓ వైపు మోదీ మరో వైపు ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా ఇంకో వైపు జేపీ నడ్డా త్రిమూర్తులు పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ అంతా అమిత్ షానే. ఇప్పటికే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయనే ముందు వెళతారు. పరిస్థితులను బేరీజు వేస్తారు. ఆపై దిశా నిర్దేశం చేస్తారు. పార్టీని నియంత్రించడంలోనూ , నడిపించడంలోనూ ఆయనే ముందుంటారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో..ఎవరికి ఏ కార్యక్రమాన్ని ఇవ్వాలో మొత్తం అమిత్ చంద్ర షా కనుసన్నలలోనే నడుస్తుంది.
ప్రస్తుతం బీజేపీకి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయినా నడిపేదంతా అమిత్ షానేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇది పక్కన పెడితే ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో అమిత్ షా వ్యూహాలు బాగా పని చేశాయి. అంతే కాదు ఇటీవల గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని బీజేపీ స్వంతం చేసుకుంది.
ఇదే సమయంలో ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ(Karnataka BJP Comment) ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇప్పటికే అమిత్ షా, ప్రధాని మోదీ, జేపీ నడ్డా పలుమార్లు పర్యటించారు. కన్నడ నాట ఈక్వేషన్స్ ను జల్లెడ పట్టారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కీలకమైన పాత్ర పోషించేది మాత్రం లింగాయత్ లే. ఆ కులపు సామాజిక వర్గం ఎటు వైపు మొగ్గితే వారే పవర్ లోకి వస్తారనేది వాస్తవం.
ఇప్పటికే కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించింది కర్ణాటకకు. ఇదే సమయంలో ప్రస్తుతం బీజేపీకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో ఈసీ ఎన్నికల తేదీని ఖరారు చేసింది. వచ్చే మే 10న పోలింగ్ , 13న ఫలితాలు ప్రకటించనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ 142 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇక బీజేపీ ఆలస్యంగా 189 అభ్యర్థులతో జాబితాను వెల్లడించింది. ఇందులో కొత్తగా 52 మందికి చోటు కల్పించింది. దీంతో అసమ్మతి సెగలు కమలంలో పెరిగాయి. ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. బీజేపీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీగా నేతలు పేర్కొంటారు.
హై కమాండ్ నిర్ణయంపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. తమను సంప్రదించకుండానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్. మాజీ డిప్యూటీ సీఎం, బీఎస్ యెడ్యూరప్ప విధేయుడిగా ఉన్న లక్ష్మణ్ సవాది తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మరో మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా తాను పోటీ చేయడం లేదంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో పార్టీ ఎల్లప్పుడూ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ సీటీ రవి. ఈ మొత్తం వ్యవహారం, జాబితా కలకలంపై అమిత్ షా, జేపీ నడ్డా ఫోకస్ పెట్టారు. ఒక రకంగా ట్రబుల్ షూటర్ కు ఇది ప్రశ్నార్థకంగా మారడం విశేషం.
Also Read : హైకమాండ్ పై బీజేపీ ఎమ్మెల్యే కన్నెర్ర