టెక్నాలజీ మారింది. దానిని ఎప్పటికప్పుడు ఉపయోగించు కోవాలి. అది ప్రజలకు మరింత చేరువ కావాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి 50 విభాగాలకు సంబంధించిన నూతనంగా పొందు పర్చిన 180 కొత్త వెబ్ సైట్ లను సీఎం ప్రారంభించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం. ఏదైనా సమాచారం కావాలంటే గతంలో ఇబ్బంది ఉండేదని, దీనిని గుర్తించామని, ఏం కావాలన్నా ఒకే ఒక్క క్లిక్ తో ఎక్కడి నుంచైనా క్షణాల్లోనే సమస్త సమాచారం కళ్ల ముందు ఆవిష్కరించేలా ప్రయత్నం చేశామని చెప్పారు సీఎం.
దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఎవరికి ఏం కావాలనే దానిపై తెలుస్తుందన్నారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదన్నారు. సాంకేతికంగా పరిజ్ఞానం లేక పోయినా సరే పేదలు సైతం కూడా తెలుసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. దీని వల్ల సర్కార్ ఏమేరకు పారదర్శకంగా పని చేస్తుందో కూడా తెలుస్తుందన్నారు.
తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ పూర్తిగా మారి పోయింది. దీనిని ఆధారంగా చేసుకుని తమ ప్రభుత్వంలో కీలకమైన శాఖలకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం. కృత్రిమ మేధస్సు సాంకేతిక భవిష్యత్తును నిర్ణయించే దిశగా సాగుతోందని పేర్కొన్నారు. దానిపై కూడా ఫోకస్ పెట్టామన్నారు.