ఐపీఎల్ 16వ సీజన్ లో కీలకమైన లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది రాజస్థాన్ రాయల్స్ . ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది కోల్ కతా. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు.
అనంతరం 150 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 13 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. జోస్ బట్లర్ సున్నాకే రనౌట్ కాగా యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాణించింది రాజస్థాన్ రాయల్స్ .
మొత్తం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ 29 బంతులు ఎదుర్కొని 47 రన్స్ చేసి ఆట చివరి దాకా ఉన్నాడు. దీంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది రాజస్థాన్ రాయల్స్. మెరుగైన రన్ రేట్ తో 3వ స్థానానికి ఎగబాకింది.
