సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ , బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా లక్నో సూర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అంపైర్లపై నోరు పారేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ పర్యవేక్షణ కమిటీ సీరియస్ అయ్యింది. కోడ్ ఆఫ్ కండక్ట్ 2.0 కింద మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
తన జట్టులో టాప్ స్కోరర్ గా ఉన్నాడు క్లాసెన్. 29 బంతులు ఆడి 47 రన్స్ చేశాడు. లెగ్ అంపైర్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆట సందర్భంగా నోరు పారేసుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది ఐపీఎల్ నిర్వహణ కమిటీ. హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని తమ విచారణలో తేలిందని పేర్కొంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆటగాడి ప్రవర్తన దారుణంగా ఉందంటూ స్పష్టం చేసింది.
ప్రసారకర్తలతో కూడా అనుచితంగా మాట్లాడాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో బహిరంగ విమర్శలు చేసినట్లు ఆర్టికల్ 2.7 ప్రకారం లెవల్ 1 నేరాన్ని క్లాసెన్ అంగీకరించాడని ఐపీఎల్ నిర్వహణ పర్యవేక్షణ కమిటీ తెలిపింది. ఈ మేరకు మ్యాచ్ ఫీజులో కోత విధించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఈ కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది.