కర్ణాటకలో ఎన్నికల యుద్దం ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. కానీ కథ ఇంకా మిగిలే ఉంది. భారీ మెజారిటీని సాధించి విస్తు పోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం సీఎం కుర్చీ మీద ఎవరు కూర్చుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది.
పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్. ఇక క్లీన్ ఇమేజ్ కలిగిన సిద్దరామయ్య సైతం పార్టీ పరంగా సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగినా ఎన్నికల్లో మాత్రం కలిసికట్టుగా ప్రయత్నం చేశారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ , రణ్ దీప్ సూర్జేవాలా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఐదు హామీలను ఇచ్చింది ఎన్నికల సందర్భంగా . సింగిల్ లార్జెస్ట్ మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఒంటరిగానే పవర్ లోకి వచ్చింది.
బెంగళూరులోని షాంగ్రిలా హొటల్ లో సాయంత్రం 6 గంటలకు సమావేశం జరగనుంది. సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై పార్టీ హై కమాండ్ కు వదిలి వేసినట్లు ప్రకటించారు డీకే శివకుమార్. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు సిద్దరామయ్య. ఇది ప్రజలు సాధించిన విజయమని ప్రకటించారు ఖర్గే. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 137 సీట్లు గెలుచుకుంది పార్టీ.