PBKS vs DC IPL 2k23 : పంజాబ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ఢిల్లీ

15 ప‌రుగుల తేడాతో అప‌జ‌యం

PBKS vs DC IPL 2k23 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ప్లే ఆఫ్ రేసులో నిల‌వాల‌ని క‌ల‌లు క‌న్న శిఖ‌ర్ ధావ‌న్ సేన‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఇప్ప‌టికే ప్లే ఆప్ రేసు నుంచి నిష్క్ర‌మించిన వార్న‌ర్ సేన ఎలాగైనా స‌రే పోయిన ప‌రువును కాపాడు కోవాల‌ని ఆల్ రౌండ్ షో చేప‌ట్టింది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో రాణించింది. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు దిమ్మ తిరిగేలా కౌంట‌ర్ ఇచ్చింది.

ఇదే లీగ్ లో భాగంగా ఇంత‌కు ముందు జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలుపొంద‌గా దానికి ప్ర‌తీకారంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ‌దులు తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 213 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఓపెన‌ర్లు పృథ్వీ షా, కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ దంచి కొట్టారు. వార్న‌ర్ మ‌రోసారి స‌త్తా చాటాడు. 46 ప‌రుగుల‌కు శిఖర్ ధావ‌న్ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. పృథ్వీ షా ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో తొలి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 54 ర‌న్స్ చేశాడు. సాల్ట్ 26 ప‌రుగుల‌తో కీల‌క పాత్ర పోషిస్తే రిల్లీ రూసో మాత్రం పంజాబ్ కింగ్స్ కు చుక్క‌లు చూపించాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం 214 ర‌న్స్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులే చేసింది. ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ 22 ర‌న్స్ చేస్తే అధ‌ర్వ థైడే 55 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన లియాన్ లివింగ్ స్టోన్ చిచ్చ‌ర పిడుగులా దుమ్ము రేపాడు. 94 ప‌రుగులు చేసి ఔరా అనిపించాడు. అయినా జ‌ట్టును గెలిపించ లేక పోయాడు.

Also Read : Siddaramaiah Comment

Leave A Reply

Your Email Id will not be published!