Congress Slams : వైఫల్యాలు తప్ప విజయాలు ఏవి
మోదీ సర్కార్ పై కాంగ్రెస్ ఫైర్
Congress Slams : మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్(Congress) పార్టీ నిప్పులు చెరిగింది. ఢిల్లీ వేదికగా భారతీయ జనతా పార్టీ(BJP) సంకీర్ణ సర్కార్ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మోదీ ఎలా దేశాన్ని,ప్రజలను మోసం చేశాడనే దానిపై పూర్తి వివరాలతో ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ పుస్తకాన్ని ఆవిష్కరించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. దీనికి 9 ఏళ్లు 9 సవాళ్లు అనే పేరు పెట్టారు. మోదీ కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా హామీలు తప్ప విజయాలు ఏవీ లేవని పేర్కొంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని ఆరోపించింది. రైతులను నిట్ట నిలువునా మోసం చేశారని మండిపడింది. నల్ల చట్టాలను రద్దు చేసిన సర్కార్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందంటూ ధ్వజమెత్తింది.
అవినీతి పరాకాష్టకు చేరిందని, జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని, ఇప్పటి దాకా 1,000 చదరపు కిలోమీటర్ల మేర చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని వాపోయింది. కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని విడదీసిందని ఆరోపించింది. ప్రజాస్వామ్య సంస్థల దుర్వినియోగం, సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేసింది. కోవిడ్ పేరుతో లూటీ చేసిందని ధ్వజమెత్తింది.
Also Read : CM KCR Comment