Maharashtra Comment : అప్ర‌జాస్వామ్యం ‘మ‌రాఠా’ పర్వం

చీల్చ‌డం దేనికి సంకేతం

Maharashtra Comment : మ‌రాఠాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను ముందుకు తీసుకు వ‌చ్చేలా చేశాయి. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన త‌ర్వాత ఏర్పాటు చేసుకున్న భార‌త రాజ్యాంగం మ‌రోసారి ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేలా చేసింది. ఇప్ప‌టికే రాజ్యాంగం ఉండాలా లేదా అన్న దానిపై చర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్న ఈ త‌రుణంలో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా పార్టీల‌ను మార్చ‌డం, మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశం. ఇది దేశానికి, స‌భ్య స‌మాజానికి ముఖ్యంగా ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాదు. అంత కంటే ప్ర‌మాద‌క‌రం కూడా . దీనిని సాధ్య‌మైనంత వ‌ర‌కు నియంత్రించ లేక పోయిన‌ట్లయితే రాబోయే రోజుల్లో పూర్తిగా రాజ్యాంగం సంక్షోభానికి గుర‌య్యే ప్ర‌మాదం నెల‌కొని ఉంది. కేంద్రంలో కొలువు తీరిన కేంద్ర స‌ర్కార్ ప్ర‌యోగాలు చేస్తూ పోతోంది. ఇదే స‌మ‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ , క‌ర్ణాట‌క , మ‌హారాష్ట్ర‌లో(Maharashtra) ప్ర‌భుత్వాలు ఉన్న ప‌ళాన కూలి పోయాయి. దాని వెనుక కుట్ర‌లు ఉన్నాయి. అంత‌కు మించిన కుతంత్రాలు ఉన్నాయి.

రాజ‌కీయాలు గ‌తంలో కంటే ఇప్పుడు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. కేవ‌లం ఓట్లు, డ‌బ్బులు, అధికార ప్ర‌యోగం మాత్ర‌మే కీల‌కంగా మారాయి. ఈ కీల‌క స‌మ‌యంలో బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాలు, సంస్థ‌లు, వ్య‌క్తులను టార్గెట్ చేస్తూ రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఇదే మ‌రోసారి రిపీట్ అయ్యింది మ‌హారాష్ట్ర‌లో(Maharashtra). ఎన్సీపీ, కాంగ్రెస్, శివ‌సేన క‌లిసి సంయుక్తంగా మ‌హా వికాస్ అఘాడీగా ఏర్పాటైంది. కానీ బీజేపీ ప‌న్నిన వ్యూహం మేర‌కు స‌ర్కార్ చీలి పోయింది. బాల్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివ‌సేన చీలి పోయింది. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ప్ర‌క‌టించారు. ఆపై బీజేపీ(BJP) స‌పోర్ట్ తో మ‌రాఠాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా భార‌త దేశ రాజ‌కీయాల‌లో అప‌ర చాణుక్యుడిగా పేరు పొందిన ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ కు ఝ‌లక్ ఇస్తూ అజిత్ ప‌వార్ గుడ్ బై చెప్పారు. ఆపై త‌న స‌హ‌చ‌ర 30 మంది ఎమ్మెల్యేల‌తో స‌హా షిండే స‌ర్కార్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు.

ఆపై డిప్యూటీ సీఎంగా , కేబినెట్ లో ప‌లువ‌రికి చోటు ద‌క్కించుకునేలా చేశాడు. దీనిపై ప‌వార్ సీరియ‌స్ గా స్పందించాడు. కేవ‌లం త‌న‌పై ఉన్న కేసుల నుంచి త‌ప్పించుకునేందుకే బీజేపీకి సపోర్ట్ గా నిలిచాడంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామ్య‌మ‌ని ఆరోపించారు శ‌ర‌ద్ ప‌వార్. ఇది ప‌క్క‌న పెడితే ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ జై కొడ‌తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీనిని నివారించ‌క పోతే రాబోయే రోజుల్లో డెమోక్ర‌సీ బ‌త‌క‌ద‌ని , చివ‌ర‌కు డ‌బ్బున్న వాళ్ల‌కే ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నిక‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుసుకోవాలి. ప్ర‌జ‌లు మారాలి. త‌మ ఆలోచ‌నా ధోర‌ణిని మార్చు కోవాలి. ఓటు అనే వ‌జ్రాయుధాన్ని వాడుకోవాలి. త‌మ కోసం ఎన్నికైన వాళ్లు గ‌తి త‌ప్పితే ప్ర‌శ్నించే స్థాయికి చేరుకోనంత కాలం ఇలాగే జంప్ అవుతూనే ఉంటారు. దేశం బాగు ప‌డాలంటే న్యాయ వ్య‌వ‌స్థ మేల్కోవాలి. త‌న మూడో క‌న్ను తెర‌వాలి.

Also Read : Congress Khammam : ఖ‌మ్మం కాంగ్రెస్ జ‌న ప్ర‌భంజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!