Modi KCR Family Comment : ఆరోపణలు సరే అరెస్ట్ ఎప్పుడు..?
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కథ
Modi KCR Family Comment : నిత్య చైతన్యానికి, పోరాటానికి , బలిదానాలకు పేరు పొందిన తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పొలిటికల్ గేమ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేశాయి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు. వీటితో వైసీపీ తెలంగాణ , బీఎస్పీ కూడా రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాలని బాస్ కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఆ మేరకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కేంద్రంలోని బీజేపీ. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడు పెంచింది. ఆ పార్టీ ఖమ్మం వేదికగా జన గర్జన సభ చేపట్టింది. రాహుల్ గాంధీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటేనంటూ మండిపడ్డారు. అందుకే తాము విపక్షాల మీటింగ్ కు కూడా రానివ్వలేదన్నారు. దీనిపై కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు. రాహుల్ కు అంత సీన్ లేదని పేర్కొన్నారు. దీనిపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వం తమదేనని ధరణిని రద్దు చేస్తామని, తెలంగాణను అడ్డం పెట్టుకుని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీని లోపల వేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దూకుడు మీదున్న ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ని ఆ పార్టీ హైకమాండ్ తప్పించింది. సౌమ్యుడైన కిషన్ రెడ్డికి పదవి అప్పగించింది. ఇంచార్జ్ లను నియమించింది. ఈ సందర్భంగా కాషాయ పార్టీ కూడా దూకుడు పెంచింది.
ఇందులో భాగంగా బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేస్తూ దూసుకు వెళ్లాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) విజయ్ సంకల్ప్ పేరుతో జరిగిన సభకు హాజరయ్యారు. ఓరుగల్లు వేదికగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
తన స్పీచ్ లో ఎక్కువ శాతం వారిపై ఆరోపణలు చేసేందుకే కేటాయించారు. అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినా మొత్తంగా ఎన్నికల వేడిని రాజేసి వెళ్లి పోయారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కేసీఆర్(KCR) కుటుంబం అవినీతిమయంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందన్నారు. ఆపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీ లు నిశితంగా గమనిస్తున్నాయని, త్వరలోనే అవినీతి, అక్రమాల చిట్టా బయటకు వస్తుందని బాంబు పేల్చారు.
ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఇదే పాట పాడారు. అటు మోదీ ఇటు షా గత కొన్నేళ్ల నుంచి కేసీఆర్ ఫ్యామిలీ గురించి పదే పదే చెబుతున్నారే తప్పా ఆచరణలో మాత్రం ఎక్కడ, ఎలా అవినీతికి పాల్పడ్డారన్న దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ మాత్రం ఇదంతా డ్రామా అని ఆరోపిస్తోంది. ఢిల్లీలో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ అని జనాన్ని నమ్మించేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని అంటోంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత గురించి పదే పదే సీబీఐ , ఈడీ బయటకు చెప్పినా మిగతా వాళ్లు అరెస్ట్ అయ్యారు కానీ ఆమె ఊసే లేకుండా పోయిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరో వైపు సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్ మాత్రం నిప్పులు చెరిగారు మోదీపై. మోదీ, షా బెదిరింపులకు భయపడ బోమంటూ స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. పీఎం ఆరోపణలు సరే ఎప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారంటూ తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు.
Also Read : Dasoju Sravan : మోదీ కళ్లు మూసుకున్న కబోధి
