Water ATMs Comment : పేదల నేస్తాలు వాటర్ ఏటీఎంలు
ఢిల్లీ ఆప్ సర్కార్ ప్రయోగం స్పూర్తి దాయకం
Water ATMs Comment : నీరే జీవనాధారం. నీరే ప్రాణాధారం. మానవ మనుగడ సాధించాలంటే శ్వాసతో పాటు నీళ్లు కూడా అత్యంత అవసరం కాదనలేని సత్యం. దేశ వ్యాప్తంగా నేటికీ తాగు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్న వారి సంఖ్య లెక్కకు మించి ఉంటోంది. స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు పూర్తయినా ఇంకా కష్టాల కడలిలోనే కొట్టుకు చస్తున్నారు. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రధాన సమస్య. ఇవాళ తాగు నీళ్లు వ్యాపారంగా మారి పోయాయి. విదేశీ కంపెనీలు ప్రతి గ్రామానికి చేరుకున్నాయి.
వాటిర్ బాటిళ్లు ఆరోగ్యానికి హానికరమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా ఎక్కడా పాటించడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నీళ్లు అవసరంగా మారాయి. లేక పోతే ప్రాణాలు పోయే పరిస్థితి. మనుషులు వస్తువులుగా మారి పోయిన తర్వాత ప్రతిదీ వ్యాపారంగా చెలామణి అవుతోంది. దేశంలోని చాలా చోట్ల నీళ్లున్నా దొరకని పరిస్థితి ఉంది. అపారమైన వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొంది. కారణం పాలకుల బాధ్యతా రాహిత్యం. అంతకు మించి కార్పొరేటర్ కంపెనీలకు కొమ్ము కాయడం. వారిని నెత్తిన పెట్టుకోవడం.
Water ATMs Comment Viral
గ్రామీణ ప్రాంతాలతో పాటు మండలాలు, పట్టణాలు, నగరాలలో నీళ్ల వ్యాపారం వేల కోట్లను దాటేసింది. ఒక్కోసారి ఆక్సిజన్ దొరుకుతోంది కానీ నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో పరిస్థితి అంతకంతకూ ఇబ్బందిగా మారింది. ఎక్కువగా పేదలు నివసించే వారికి నీళ్లు అందడం లేదు. దీనిని ప్రత్యేకంగా గమనించారు ఆప్(AAP) కన్వీనర్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఆయన పేదలతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. గతంలో పరివర్తన్ స్వచ్చంధ సంస్థలో పని చేశారు.
సహ భావన అనేది ఆయనకు అలవడిన గుణం. ఇది సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్న వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరూ ఊహించని రీతిలో నీళ్ల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డబ్బులు తీసుకునే ఏటీఎంలు లాగానే వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పుడు కోట్లాది మందిని ఆశ్చర్య పోయేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఢిల్లీలో 500లకు పైగా వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
చాలా చోట్ల పైపులు ఏర్పాటు చేశారు. కానీ పైపులు వెళ్లని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం బాధ్యతాయుతమైన పనిని భుజాన వేసుకుంది. ఇందు కోసం వాటర్ ఏటీఎంలను తీసుకు వచ్చింది. దీనికి శ్రీకారం చుట్టింది మాత్రం సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal). ప్రస్తుతం వేలాది మంది ఢిల్లీలోని పేదల దాహార్తిని తీర్చుతున్నాయి ఈ వాటర్ ఏటీఎంలు. ఈ నీళ్లన్నీ శుద్ది చేసినవే కావడం విశేషం. ప్రతి ఒక్కరికీ రోజుకు 20 లీటర్ల నీటిని అందజేస్తుంది ప్రభుత్వం. వీరికి కార్డులను కూడా ఇస్తోంది. దీనిని పొందిన వారు బాటిల్ ను తీసుకుని ఏటీఎం వద్దకు వెళ్లి కార్డు స్వైప్ చేస్తే చాలు నీళ్లు వస్తాయి. ప్రస్తుతం పేదలకు పూర్తి స్థాయిలో దాహాన్ని తీర్చ లేక పోయినా కనీసం ఇబ్బంది పడకుండా చేయడంలో ఆప్ ప్రభుత్వం సఫలమైందని చెప్పక తప్పదు. ఈ వాటర్ ఏటీఎంలపై విమర్శలు లేక పోలేదు. వాటన్నింటిని పక్కన పెడితే సాయపడేది ఏదైనా దానిని మనం స్వాగతించాల్సిందే. ఇలాంటి ఏటీఎంలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏర్పాటు చేస్తే బావుంటుంది కదూ.
Also Read : Mallikarjun Kharge : మతం పేరుతో హింస తగదు – ఖర్గే