BRS MLA Attack Comment : ఎమ్మెల్యేలా వీధి రౌడీలా..?

గులాబీ ఎమ్మెల్యే గూండా గిరి

BRS MLA Attack Comment : అధికారం ఎన్న‌టికీ శాశ్వ‌తం కాదు. రాచ‌రికంలో అయితే శాశ్వ‌తంగా ఉండేందుకు ఆస్కారం ఉంది. కానీ ఇది ప్రజాస్వామిక దేశం. ఇందులో ప్ర‌తి ఒక్క‌రికీ పోటీ చేసే హ‌క్కు, ప్ర‌శ్నించే హ‌క్కు, నిల‌దీసే హ‌క్కు ఉంటుంది. కాద‌ని అనుకుంటే దానికి జ‌వాబు చెప్పే హ‌క్కు, కాద‌నే హ‌క్కు కూడా ఆరోప‌ణ‌ల‌కు గురైన వాళ్లు, విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతున్న వాళ్ల‌కు స్వేచ్చ ఉంటుంది.

ఒక‌ప్పుడు ఎమ్మెల్యేలంటే గౌర‌వం ఉండేది. అంత‌కు మించి అభిమానం పెరిగేది. కానీ రాను రాను రాజ‌కీయాలు బ‌క్వాస్ గా త‌యార‌య్యాయి. కేవ‌లం ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా చూడ‌డం అల‌వాటుగా మారింది. దీంతో స‌క‌ల అవ‌ల‌క్ష‌ణాలు ఉన్న వాళ్లు, నేర‌స్థులు, అక్ర‌మార్కుల‌కు పాల్ప‌డుతున్న వాళ్లు, భూ క‌బ్జా రాయుళ్లు, మాఫియా డాన్ లు, మ‌ర్డ‌ర్ చేసే వాళ్లు ఊరేగుతున్నారు. జ‌నం పాలిట శాపంగా మారారు. క‌ళ్ల ముందే దాడుల‌కు దిగుతున్నారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

BRS MLA Attack Comment Viral

జ‌వాబుదారీగా ఉండాల్సిన వాళ్లు నైతిక‌త అనే గీత‌ను దాటుతున్నారు. తాము ఏం చెబితే అదే శాస‌నం, చ‌ట్టం అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌. అధికారంలో కొలువు తీరి ఉంది భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ(BRS). దీనికి ఉద్య‌మ నేప‌థ్యం క‌లిగిన నాయ‌కుడు కేసీఆర్ బాస్ గా ఉన్నారు. ఆయ‌నే ఈ రాష్ట్రానికి రెండోసారి సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ముచ్చ‌ట‌గా మూడోసారి ఎన్నిక‌య్యేందుకు పావులు క‌దుపుతున్నారు. 119 సీట్ల‌కు గాను ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. బీ ఫామ్ లు కూడా ఇచ్చేశాడు. ఇదంతా ప‌క్క‌న పెడితే గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు గూండా గిరీ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాడులు చేయ‌డం, ఎదురు తిరిగిన వారిని నామ రూపాలు లేకుండా చేయ‌డం, కేసులు పెట్టించి మ‌రీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం ష‌రా మామూలై పోయింది.

ర‌క్షించాల్సిన ఖాకీలు తాబేదారులుగా మారి పోతే ఇక ర‌క్ష‌ణ ఎలా ఉంటుంది. తాజాగా గులాబీ పార్టీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద(MLA Vivekananda) రెచ్చిపోయారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కూన శ్రీ‌శైలం గౌడ్
లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌ను త‌ట్టుకోలేక పోయాడు. ఓ ఛాన‌ల్ డిబేట్ లో లైవ్ లో ఉన్నార‌న్న సోయి మ‌రిచి పోయి ఏకంగా దాడికి దిగాడు. త‌న గొంతు ప‌ట్టుకుని చంప బోయాడు. వివేకానంద రౌడీ ఎమ్మెల్యేగా దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారి పోయాడు. ఇప్పుడు ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం ఉంది.

ప్ర‌స్తుతం న‌డిపించే అధికారం కేవ‌లం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సిఇఓ) లేదా గ‌వ‌ర్నర్ చేతిలో ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌పై పార్టీ ప‌రంగా, స‌ర్కార్ ప‌రంగా, ఈసీ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు. అవ‌త‌లి వ్య‌క్తి ఏమైనా అన్నా స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త క‌లిగిన ఎమ్మెల్యే ఇలా దాడికి దిగ‌డం స‌భ్య స‌మాజం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇలాంటి వాళ్ల‌ను జీవితాంతం పోటీ చేయ‌కుండా చూడాల‌ని జ‌నం కోరుతున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు మారాలి. లేక పోతే ఇవాళ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే రేపు ఇంకో పార్టీ ఎమ్మెల్యే దాడికి దిగుతారు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : Telangana Congress : ఖాకీలు..ఆఫీస‌ర్ల‌పై ఈసీకి ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!