Maoist: వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం !
వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం !
Maoist: దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. గత ఐదేళ్లలో… ఏడాదికి రూ. వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే చెబుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఈ మేరకు ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర బలగాలను పంపడంతోపాటు… మారుమూల ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తద్వారా ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒకప్పుడు ఆరేడు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఛత్తీస్ గఢ్(Chhattisgarh) లో తీవ్రంగాను.. మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్ లలో కొంతమేర ప్రభావం కనిపిస్తోంది.
Maoist Rules
గత నాలుగు నెలల కాలంలో ఛత్తీస్ గఢ్(Chhattisgarh) లో 80 మంది మావోయిస్టులు మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బలగాలను పంపడంతోనే సరిపెట్టకుండా కేంద్రం వివిధ పథకాల కింద మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. 2018-19 నుంచి 2022-23 వరకు.. అంటే ఐదేళ్ల కాలంలో కేంద్రం ప్రభావిత రాష్ట్రాలకు రూ.4,931 కోట్లు మంజూరు చేసింది. దీనికితోడు బలగాలను క్షేత్రస్థాయికి తరలించేందుకు, గాయపడినవారిని చికిత్స కోసం తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ల ఖర్చుల కింద మరో రూ.765 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ ఇటీవల రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. ఈ నిధుల్లో సింహభాగం వివిధ అభివృద్ధి పనులకు ఖర్చుపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీం’, ‘సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్’, ‘స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్’ వంటి పథకాల కింద నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధులను పోలీస్స్టేషన్ల నిర్మాణం; పోలీసు వాహనాలు, అవసరమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు మొదలుకొని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కూడా వెచ్చించవచ్చు.
ఈ ఐదేళ్లలో ప్రభావిత ప్రాంతాల్లో 13,630 కిలోమీటర్ల మేర రహదారులు, 13,823 సెల్ ఫోన్ టవర్లు కొత్తగా నిర్మించారు. సరైన సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని, తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లకుండా చూడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. 2010లో 96 జిల్లాల్లోని 465 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న మావోయిస్టు కార్యకలాపాలు 2023 నాటికి 42 జిల్లాలు, 171 పోలీస్స్టేషన్లకు పరిమితం అయ్యాయి. ఈ మేరకు ఓవైపు భద్రతా బలగాలతో ఒత్తిడి పెంచుతూనే మరోవైపు అభివృద్ధితో ప్రజలకు దగ్గర అవడం ద్వారా వామపక్ష తీవ్రవాదంపై పట్టు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది.
Also Read : Supreme Court: నోటా పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు!