Supreme Court: నోటా పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు!

నోటా పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు!

Supreme Court: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరినీ తిరస్కరిస్తూ నోటాకు ఓట్లు వేస్తే… సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని రచయిత, మోటివేషనల్ స్పీకర్ శివ్‌ ఖేడా తన పిటిషన్‌ లో కోరారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఈ అంశంపై ఎన్నికల సంఘాని(ఈసీ) కి నోటీసు జారీ చేసింది. పిల్‌ ద్వారా లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం అంగీకరించింది.

Supreme Court Orders

నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు తదుపరి ఐదేళ్లు ఏ ఎన్నికలోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని పిటిషనర్‌ కోరారు. నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్‌ లోక్‌ సభ స్థానంలో పోలింగ్‌ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్‌ ప్రస్తావించిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం… ఈసీకి నోటీసు పంపించింది. పిటిషన్‌ లోని అంశాలపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది.

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు 2013లో వెలువరించిన తీర్పు మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ ‘నోటా’ మీట నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.

Also Read : Nominations Scrutiny: ముగిసిన నామినేషన్ల పరిశీలన ! గుంటూరు లోక్‌సభకు అత్యధిక నామినేషన్లు !

Leave A Reply

Your Email Id will not be published!