Arani Srinivasulu: తిరుపతి జనసేన అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులపై దాడి !

తిరుపతి జనసేన అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులపై దాడి !

Arani Srinivasulu: తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య ప్రారంభైమన వాగ్వివాదం… దాడులకు దారి తీసింది. టీడీపీ, జనసేన బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీనితో పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈసీ అనుమతులతో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు తమపై దాడి చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కూటమి అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) మాట్లాడుతూ… ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు. కార్యకర్తలపై దాడి చేయడం సరికాదని చెప్పారు. ఇదేవిధంగా దాడులు ప్రోత్సహిస్తే తగిన మూల్యం వైసీపీ చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అనైతిక చర్యలను కూటమి పార్టీలు సమర్థంగా ఎదుర్కొంటాయన్నారు. తిరుపతిలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ చెడగొట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. పోలీసులు, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీలో విధ్వంసకాండ సృష్టించారని ఆరణి శ్రీనివాసులు అన్నారు. రూ.13లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు.సంక్షేమం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని మండిపడ్డారు. గుంతలు కూడా పూడ్చలేని స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు.

Arani Srinivasulu – రూ. 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచేశారు – సుగుణమ్మ

జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం విధ్వంసమేనని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. ఎన్డీఏ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. విశ్వసనీయత, నైతికత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. వైసీపీ అరాచక పాలన అంతం.. కూటమితోనే సాధ్యమన్నారు. జగన్ చేతకాని పాలన..చంద్రబాబు సమర్థవంతమైన పాలనను ప్రజలకు వివరిస్తామని చెప్పుకొచ్చారు. రూ. 8లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచేశారని సుగుణమ్మ మండిపడ్డారు.

Also Read : BJP Leaders Tour: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు !

Leave A Reply

Your Email Id will not be published!