Karnataka CM: సీఎంకు జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు !

సీఎంకు జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు !

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. 2022లో రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది. అంతేకాదు ఈ కేసులో మార్చి 6న ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యతో(Siddaramaiah) పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, మంత్రులు ఎంబీ పాటిలవ్, రామలింగారెడ్డికి కూడా కోర్టు రూ.10,000 జరిమానా వేసింది. రామలింగారెడ్డిని మార్చి 7న, సూర్జేవాలాను మార్చి 11న, ఎంబీ పాటిల్‌ను మార్చి 15న ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

Karnataka CM Viral

2022లో బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన గ్రామంలో పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. ఇందులోభాగంగా నాటి సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు మార్చ్‌ చేపట్టగా… రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను తోసిపుచ్చిన కర్ణాటక హైకోర్టు… ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది. అంతేకాదు ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రూ.10 వేలు జరిమానా విధించింది.

Also Read : AP CM YS Jagan : ఏపీ నుంచి ఈ ముగ్గురు నేతలు రాజ్యసభకు – సీఎం వైఎస్ జగన్

Leave A Reply

Your Email Id will not be published!