Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీర్ల కోసం ప్రభుత్వానికి మంచిర్యాల వాసి లేఖ !
కింగ్ ఫిషర్ బీర్ల కోసం ప్రభుత్వానికి మంచిర్యాల వాసి లేఖ !
Kingfisher Beer: మండుతున్న ఎండల్లో మందుబాబులు ఛిల్లయ్యేది బీర్లతో మాత్రమే. బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్, స్కాచ్, వోడ్కా కంటే వేసవిలో చల్లటి బీర్లను త్రాగడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. ముచ్చెమటలు పట్టించే ఈ వేడి వాతావరణంలో చల్లని బీర్లు తాగితే.. హాయిగా ఉంటుందని వాళ్లు భావిస్తారు. అందుకే.. వేసవిలో బీర్ల కోసం మద్యం షాపుల ముందు క్యూ కట్టేస్తారు. ఈ నేపథ్యంలో వేసవిలో బీర్ల అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే మందుబాబుల నుండి వచ్చే డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి మద్యం సిండికేట్లు మంచి బ్రాండ్లకు కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. సరిగ్గా తెలంగాణాలో కూడా ఈ ఏడాది ఇదే జరుగుతోంది. ముఖ్యంగా మంచిర్యాలలో కింగ్ ఫిషర్ బీర్లకు చాలా గిరాకీ ఏర్పడింది. కొన్ని షాపుల్లో మాత్రమే ఈ కింగ్ ఫిషర్(Kingfisher) బీర్లు లభిస్తుండటంతో… మంచిర్యాలకు చెందిన తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కింగ్ ఫిషర్ బీర్లు ఇప్పించండి మహాప్రభో అంటూ తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Kingfisher Beer Issue..
ఈ బీర్ల కొరతపై మంచిర్యాలలోని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ… కింగ్ ఫిషర్ బీర్ల(Kingfisher Beer)ను సరిపడా అందుబాటులో ఉంచాలని కోరారు. వ్యాపారులే బీర్ల కొరతను సృష్టిస్తున్నారని… ఖరీదైన బీర్ల విక్రయాల్ని పెంచుకోవడం కోసమే లైట్ బీర్లను మార్కెట్ లోకి తీసుకురావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. బీర్ల కొరతను సృష్టిస్తున్న వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు సిండికేట్ గా మారి లైట్ బీర్లను అమ్మడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడంలో మందుబాబుల పాత్ర ఎంతో కీలకమైందని, అలాంటి తమను ఆదుకోవాలని, కింగ్‌ఫిషర్(Kingfisher) లైట్ బీర్లను అందుబాటులోకి తేవాలని కోరారు.
కొన్ని రోజులుగా మంచిర్యాలలో కేఎఫ్ లైట్ బీర్లు ఏ షాప్‌లో గానీ, బార్లలో గానీ లభ్యం కావడం లేదని… దీనితో ఈ మండుటెండల్లో దాహం తీర్చుకోవడానికి జనాలు ఇబ్బందులకు గురవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తలనొప్పి, వాంతులు వస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయని… కాబట్టి వైన్ షాప్స్, బార్లలో లైట్ బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరి తరఫున తాను కోరుతున్నానని ఆ అధ్యక్షుడు చెప్పారు. ఈ విషయంలో తమకు సహకరిస్తే.. రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో తాము కృషి చేస్తామని తెలియజేశారు.
ఇదిలావుండగా… కొన్ని రోజుల క్రితమే సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో బీర్ల విషయమై పెద్ద గొడవ జరిగిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ వైన్ షాప్‌లో బీర్లు లేవని చెప్పినందుకు, మద్యం ప్రియులు ఆందోళన చేపట్టారు. వారిని సముదాయించేందుకు ఏకంగా పోలీసులు రంగంలోకి దిగారంటే, వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి పోలీసులపైనే వారు చెయ్యి చేసుకునే స్టేజ్‌కి గొడవ చేరింది. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. సుమారు గంటసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి మందుబాబుల్ని స్టేషన్‌కి తీసుకెళ్లి.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, తిరిగి ఇంటికి పంపించారు.
Also Read : Smriti Irani : యూపీలోని అమేథీ ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన నటి స్మ్రితి