Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ !
కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ !
Arvind Kejriwal: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనితో కేజ్రీవాల్ కు బెయిల్ జారీ చేసే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం (మే 10) ఉత్తర్వులు వెలువరించనుంది.
Arvind Kejriwal Case Updates
‘‘ఎన్నికల ప్రచారం చేసే హక్కు అనేది… ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందకు రాదు. మాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా సరే ఆ వెసులుబాటు లభించలేదు. గతంలో మేం సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇలాంటి కారణాలే చూపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు రాలేదు. గత మూడేళ్లలో 123 ఎన్నికలు జరిగాయి. సంవత్సరమంతా ఏదో ఒకచోట… ఏవో ఒక ఎన్నికలు ఉంటూనే ఉన్నాయి. ఇలా ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తే ఏ రాజకీయ నేతను అరెస్టు చేయలేం. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేం’’ అని ఈడీ తమ అఫిడవిట్లో పేర్కొంది.
ప్రచారం కోసం కేజ్రీవాల్(Arvind Kejriwal) కు బెయిల్ మంజూరుచేయడం అనేది చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని ఈడీ అభిప్రాయపడింది. నేరాలకు పాల్పడే నేతలు ఎన్నికల ముసుగులో విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశంగా మారుతుందని పేర్కొంది. అంతేగాక, ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని తెలిపింది. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని అఫిడవిట్లో పేర్కొంది.
మద్యం పాలసీ అవకతవకల కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున… ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని తెలిపింది. దీనితో బెయిల్ పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్పై శుక్రవారం తీర్పు వెలువడనుంది.
Also Read : IPL 2024 RCB vs PBKS : టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్