Telangana Rains: ఆసుపత్రి ఆవరణలో కూలిన చెట్టు ! భార్య చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మృతి !
ఆసుపత్రి ఆవరణలో కూలిన చెట్టు ! భార్య చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మృతి !
Telangana Rains: సికింద్రాబాద్(Secunderabad) కంంటోన్మెంట్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోకాలి నొప్పితో బాధపడుతున్న తన భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ వ్యక్తిపై ఒక్కసారిగా చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి అనుకోని ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Telangana Rains Update
శామీర్‌పేటలోని తూంకుంట పట్టణంలో నివసించే సరళాదేవి… బొల్లారంలోని త్రిశూల్ పార్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కాలినొప్పికి చికిత్స నిమిత్తం భర్త రవీంద్ర (52)తో కలిసి ద్విచక్రవాహనంపై కంటోన్మెంట్ ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా పక్కనున్న తురాయి చెట్టు కుప్పకూలింది. రవీంద్ర ఛాతీపై కాండం పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన తన వెనుకున్న సరళాదేవి మీద పడటంతో ఆమె నేలపైపడ్డారు. దీంతో తల, వెన్నుపూస, కాళ్లకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొద్ది క్షణాల ముందు అదే చెట్టు కింద నుంచి వచ్చిన వారు ఈ ఘటనను చూసి వణికిపోయారు. భర్త చనిపోయిన విషయం తెలియక ఆసుపత్రిలో ఆయన క్షేమ సమాచారాన్ని అడుగుతున్న సరళాదేవి పరిస్థితిని చూసి బంధువులు, తోటి ఉపాధ్యాయులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అయితే రెండు వారాల క్రితమే ఆసుపత్రిలోని ప్రమాదకర వృక్షాలను నరికి వేయించినట్లు వైద్యులు ఆయనకు వివరించడం గమనార్హం.
భార్య కాలినొప్పితో బాధపడుతుండటంతో వైద్యుడికి చూపించేందుకు తీసుకెళ్తున్న భర్తను ఓ మోడువారిన చెట్టు రెప్పపాటులో బలి తీసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఏళ్ల తరబడి ఆ చెట్టు రవీంద్ర కోసమే కాచుకొనుందా అన్నట్లు ఆ దంపతులు ద్విచక్రవాహనంపై ఆసుపత్రి ఆవరణలోకి రాగానే ఒక్కసారిగా మీద పడింది. మంగళవారం సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన చూపరులను ఉలికిపాటుకు గురి చేసింది. నెల రోజుల క్రితమే ఎండిపోయిన ఆ వృక్షాన్ని ముందే తొలగించి ఉంటే ఒకరి ప్రాణాలు నిష్కారణంగా పోయేవి కాదని.. కనీసం ఇటీవల వర్షాలకు మొదళ్లు పెకలించుకుని వచ్చినప్పుడైనా స్పందించి ఉంటే ఆ ఉపాధ్యాయురాలికి ఇంత శోకం మిగిలేది కాదని అక్కడున్న వారు చెప్పుకుంటున్నారు.
Also Read : New Medical Colleges for AP: ఏపీలో మరో ఐదు మెడికల్ కాలేజీలు !