Attack on Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం
అన్ని దర్యాప్తు సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తామని ఎఫ్‌బీఐ వెల్లడించింది...
Attack on Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దాడిపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇది హత్యాప్రయత్నం అని ప్రకటించింది. ‘‘ ఈ రోజు (శనివారం) సాయంత్రం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)పై హత్యాయత్నం జరిగింది’’ అని ఎఫ్‌బీఐకి చెందిన పిట్స్‌బర్గ్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఇన్‌ఛార్జ్ కెవిన్ రోజెక్ అన్నారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Attack on Trump Viral
ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని, ఎందుకు జరిగింది?, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను గుర్తించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని రోజెక్ చెప్పారు. సామాన్య జనం ఎవరి వద్దైనా ఏదైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని కోరారు. కాగా దేశవ్యాప్తంగా దర్యాప్తు ఏజెంట్లు, సాక్ష్యాలు సేకరించే బృందాలు, ఇతర సిబ్బందిని ఎఫ్‌బీఐ రంగంలోకి దింపిందని కెవిన్ రోజెక్ వెల్లడించారు. నిందితుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదని అన్నారు. నిందితుడిని ఇప్పటికే గుర్తించినప్పటికీ డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తామని ఎఫ్‌బీఐ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఫొటోలను కోసం ఎదురుచూస్తు్న్నామని, డీఎన్ఏ ఫలితం వచ్చాక బయోమెట్రిక్ నిర్ధారణ చేస్తామని రోజెక్ వివరించారు.
అన్ని దర్యాప్తు సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తామని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఆధారాలు సేకరించేందుకు ఏజెంట్లు రంగంలోకి దిగారని వివరించింది. కాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం దాడి జరిగింది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల నిందితుడు తుపాకీతో కాల్పులు జరపగా ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. అయితే యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కేవలం 2 సెకన్ల వ్యవధిలోనే నిందితుడిని కాల్చించారు.
Also Read : AP Home Minister : ఏపీలో డ్రగ్స్, గంజాయి పై ఉక్కుపాదం మోపుతాం