Deputy CM Bhatti : రైతు భరోసా అమలుపై కీలక అంశాలను వెల్లడించిన డిప్యూటీ సీఎం
రైతు భరోసా సదస్సులో పాల్గొన్న రైతుల అభిప్రాయం క్రోడీకరిస్తామని తెలిపారు...
Deputy CM Bhatti : రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై ప్రభుత్వం వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను కూడా మంత్రి వర్గ ఉప సంఘం ఆచరణలోకి తీసుకుంటుంది. ఈ రోజు వరంగల్‌లో రైతు భరోసాపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. రైతు భరోసా పథకానికి సంబంధించి విధి, విధానాలపై మంత్రులు ఈ సమావేశంలో చర్చించారు. ఈ కమిటీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, సాగు విస్తీర్ణం, రైతాంగ స్థితిగతులపై అధ్యయనం చేస్తుంది. అయితే రైతులతో చర్చించిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) పలు కీలక విషయాలు మీడియాకి వెల్లడించారు.
Deputy CM Bhatti Comment
రైతు భరోసా సదస్సులో పాల్గొన్న రైతుల అభిప్రాయం క్రోడీకరిస్తామని తెలిపారు. అందరి సూచనలు నోట్ చేసుకున్నామన్నారు. అన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. అందరి అభిప్రాయానికి తగినట్టుగా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వరంగల్ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ లాంటి పథకాలు అమలు చేశామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఒక సారి ఇచ్చామని.. ఇప్పుడు రైతు భరోసాపై అమలుకు విధి విధానాల రూపకల్పన కోసం విస్తృత స్థాయిలో ఆభిప్రాయ సేకరణ చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని అన్నారు. రైతులకు అందించే భరోసా సొమ్ము ప్రజలు టాక్స్ రూపంలో చెల్లించినవేనని అన్నారు. అందుకే ప్రతి పైసా సక్రమంగా వినియోగం కోసం అన్నివర్గాల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని, ఇన్సురెన్స్ కంపెనీలతోను చర్చలు జరుపుతున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేశామని రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. రైతుల అభిప్రాయాలు క్రోడీకరించి శాసన సభలో చర్చిస్తామని అన్నారు. చర్చించిన తర్వాతే రైతు భరోసా అమలు చేస్తామని అన్నారు. వచ్చే ప్రతీ చిన్న ఆదాయాన్ని పోగుచేసి ప్రజలకే పంచుతామని చెప్పారు. ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా వస్తుందని చెప్పారు. త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. రైతు భరోసాతో పాటు ఇన్‌ఫుట్ సబ్సిడీ లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read : Minister Nadendla : పవన్ కళ్యాణ్ ఓపికతో ఒక వ్యూహం మీద పని చేస్తున్నారు