CM Siddaramaiah : బీజేపీ, జేడీఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం
ఇందులో ఎక్కడా అవినీతి లేదని, అంతా చట్టానికి అనుగుణంగా ఉందన్నారు...
CM Siddaramaiah : మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో తన భార్యకు ఇంటి స్థలాలు కేటాయించడంలో అవినీతి జరగలేదని అయినా బీజేపీ, జేడీఎస్ సభ్యులు తనకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర పన్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. తాను రెండోసారి సీఎం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. విధానసౌధలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముడాలో అవినీతి జరిగిందని వాయిదా తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారని అన్నారు. స్పీకర్, సభాపతి చర్చకు అవకాశం ఇవ్వలేదని, ఇది చెడు సంప్రదాయం అవుతుందని వారు నిరాకరించారని తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యంతో వాయిదా తీర్మానం కోరడమే తప్పు అన్నారు. రెండు రోజులు కార్యకలాపాలను అడ్డుకున్నారని అన్నారు. ప్రజాసమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిరంతరం నిరసనలు కొనసాగించారని తెలిపారు.
CM Siddaramaiah Comment
రాష్ట్రమంతటా వరదలు కొనసాగుతున్నాయని, వాటి నష్టాలపై సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తావించారని, ప్రతిపక్ష సభ్యులు స్పందించలేదని పేర్కొన్నారు. 40 ఏళ్ల కిందటే మంత్రి అయ్యానని, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. ప్రతిపక్షాల నాయకులు కక్షతో రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలలో వారు విశ్వాసం కోల్పోయారని తెలిపారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. మైసూరులో దశాబ్దాల కాలం క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండేదని, 1987లో ముడా ఏర్పడిందన్నారు. తన బావమరిది బీఎం మల్లికార్జునస్వామి 464 సర్వేలో 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారని తెలిపారు.
పీటీసీ చట్టం ప్రకారం ఉల్లంఘన జరగలేదన్నారు. సదరు భూమిని మల్లికార్జునస్వామి మైసూరుకు చెందిన నింగాబింగ్ జౌరా అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని అన్నారు. అతడికి ముగ్గురు కొడుకులు కాగా చిన్నకుమారుడు దేవరాజ్‌కు రాసిచ్చారన్నారు. అతడి నుంచే భూమి కొనుగోలు చేశారన్నారు. అది పిత్రార్జిత ఆస్తి అన్నారు. ఇటీవల వారి వారసుడు మంజునాథ్‌ను తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. మల్లికార్జునస్వామి ఆడపడుచు లాంఛనంగా తన భార్య పార్వతికి దానవిక్రయం చేశారని తెలిపారు. సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకుని పార్కును ఏర్పాటు చేసిందన్నారు. పరిహారంగా 14 ఇళ్ల స్థలాలు కేటాయించిందన్నారు. ఇందులో ఎక్కడా అవినీతి లేదని, అంతా చట్టానికి అనుగుణంగా ఉందన్నారు. బీజేపీ-జేడీఎస్ పార్టీలు పనిగట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
శాసనసభ కార్యకలాపాలలో సమయాన్ని వృథా చేశారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. ఒకరోజు ముందుగానే సభ ముగిసేందుకు బీజేపీ(BJP), జేడీఎస్(JDS) నాయకులు కారకులయ్యారని అన్నారు. ప్రజాసమస్యలపై చర్చలకు వీలు లేకుండా వాల్మీకి కార్పొరేషన్ అంశాన్ని మొదటివారంలోనూ, ముడా స్థలాల అంశాన్ని రెండోవారంలో సభలో చర్చకు డిమాండ్ చేసి సమయాన్ని వృథా చేశారని పేర్కొన్నారు.
ముడా పరిధిలో కేంద్రమంత్రి కుమారస్వామికి ఇంటి స్థలం ఉందని నగరపాలక శాఖ మంత్రి భైరతి సురేశ్ తెలిపారు. ఆయన 1984 నవంబరు 7న మంజూరు చేశారని పేర్కొన్నారు. జేడీఎస్, బీజేపీకి చెందిన నాయకులకు ఇళ్లస్థలాలు ఉన్నాయని, వీరిలో ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు రెండు చోట్ల, బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్, సా రా మహేశ్‌తోపాటు పలువురికి ఇళ్లస్థలాలు ఉన్నాయని తెలిపారు.
Also Read : PM Narendra Modi : యుద్ధం ప్రారంభం తర్వాత మొదటిసారి యుక్రెయిన్ వెళ్తున్న మోదీ