JC Prabhakar Reddy : వైఎస్ విజయమ్మతో భేటీ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక సంచలన పరిణామమే అని చెప్పుకోవాలి...

JC Prabhakar Reddy : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ హడావుడి చేస్తుండగా.. కూటమి మాత్రం పోలవరం, అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత్ర శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యమే. అందుకే.. ఎప్పుడు ఎవరు ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతారో..? ఎవరు ఎవరితో భేటీ అవుతారో..? ఎందుకు..? అనేది తెలియట్లేదు. ఇందుకు హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ భేటీనే చక్కటి ఉదాహరణ.

JC Prabhakar Reddy Meet

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక సంచలన పరిణామమే అని చెప్పుకోవాలి. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy).. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మితో(YS Vijayamma) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న విజయలక్ష్మి నివాసానికి వెళ్లిన ప్రభాకర్.. సుమారు అరగంటకు పైగా పలు విషయాలపై చర్చించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ భేటీలో ఏపీ రాజకీయ పరిస్థితులు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని.. కేవలం యోగక్షేమాలు తెలుసుకోవడానికేనని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. వాస్తవానికి వైఎస్ కుటుంబానికి.. జేసీ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వైఎస్ హయాంలో రెండు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగారు కూడా. ఆ పరిచయాలు, సంబంధాలతోనే ఇంటికెళ్లి జేసీ ప్రభాకర్ కలిసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వైఎస్ జగన్‌ అంటే అస్సలు పడని.. అవకాశం దొరికితే చాలు ఒంటికాలిపై లేస్తుంటారు జేసీ బ్రదర్స్.. ఫ్యామిలి. కూటమి గెలిచిన తర్వాత వైసీపీ హయాంలో తనను అరెస్ట్ చేసిన తీరు.. వైఎస్ జగన్‌పై ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు. ఆఖరికి కొన్ని వాడకూడని.. రాయకూడని పదాలు కూడా వాడేశారు జేసీ. అలాంటిది సడన్‌గా విజయమ్మతో జేసీ ప్రభాకర్ ఎందుకు భేటీ అయ్యారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. భేటీలో ఏం జరిగిందనేది కూడా కనీసం అటు విజయమ్మ నుంచి గానీ.. ఇటు జేసీ నుంచి గానీ ఎలాంటి సమాచారం బయటికి పొక్కలేదు.. కానీ ఫొటో మాత్రం బయటికొచ్చింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఏవేవో ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. భేటీ ఎందుకనేది పక్కనెడితే.. ఈ విషయం తెలిశాక.. ఫొటో చూశాక వైఎస్ జగన్ రెడ్డి ముఖ చిత్రమేంటి..? అని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. దీనిపై వైసీపీ.. షర్మిల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Also Read : Minister Rammohan Naidu : ఏవియేషన్ మంత్రిని కలిసిన విజయవాడ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!