Minister Ponguleti : LRSపై మంత్రి పొంగులేటి ఓ సంచలన నిర్ణయం

ఎల్‌ఆర్‌ఎస్‌పై శనివారం నాడు జిల్లా కలెక్టర్‌లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు...

Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఎల్ఆర్ఎస్‌ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి(Minister Ponguleti) ఆదేశించారు.

Minister Ponguleti Comment

ఎల్‌ఆర్‌ఎస్‌పై శనివారం నాడు జిల్లా కలెక్టర్‌లతో మంత్రి పొంగులేటి(Minister Ponguleti) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31, 2020 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆమోదించిందని గుర్తుచేశారు. ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత నాలుగేళ్లుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి(Minister Ponguleti) కలెక్టర్లకుసూచించారు.

ఇందుకోసం, జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్‌లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు తక్షణమే శిక్షణ చేపట్టాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ విధివిధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను వెంటనే చేపట్టాలని, జిల్లా కలెక్టర్‌లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లే అవుట్ల క్రమబద్దీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. వారి ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించిన లే అవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఆమోదించిన లేఅవుట్ యజమానులు, ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి సహాయపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Pemmasani Chandrasekhar: 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి – కేంద్ర మంత్రి పెమ్మసాని

Leave A Reply

Your Email Id will not be published!