Nizamabad Municipal Corporation: ఏసీబి వలకు చిక్కిన నిజామాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి కొండ !

ఏసీబి వలకు చిక్కిన నిజామాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి కొండ !

Nizamabad: ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్(Nizamabad) మున్సిపల్ కార్పోరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.3కోట్ల నగదు(2,93,81,000)ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 1.10 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు నరేందర్‌ ఇంట్లో ఉన్న 51తులాల బంగారం, 17 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్‌ చేశారు. అంతేకాదు నరేందర్‌ ఆఫీసులో రూ.90వేలు దొరికాయి. అధికారులు సీజ్‌ చేసిన నగదు, బంగారం, ఆస్తి పత్రాల విలువరూ.6,07,81,000. ఒక సూపరింటెండెంట్‌ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

Nizamabad Municipal Corporation..

ఈ నోట్లను లెక్క పెట్టడానికి రెండు కౌంటింగ్‌ మిషన్లను ఉపయోగించారు. నిజామాబాద్‌(Nizamabad) జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఇదే మొదటిసారని తెలిపారు. నరేందర్‌ను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు శుక్రవారం దాసరి నరేందర్‌ ఇంటితో పాటు ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటినా కొనసాగాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 25 మంది ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు.

మునిసిపల్‌ కార్పొరేషన్‌లో నరేందర్‌ చాలా కాలంగా సూపరింటెండెంట్‌గా పనిచేస్తూనే ఇన్‌చార్జి రెవెన్యూ అధికారిగానూ కొనసాగుతున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట పనిచేయడంతో అనుమతుల విషయంలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంతకాలంగా నరేందర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదించినా పట్టించుకోకపోవడంతో కొంతమంది ఏకంగా ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు.

ఆయన ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం తనిఖీలను చేపట్టారు. నరేందర్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు మొదలయ్యాయని తెలవగానే కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగుల్లోనూ అలజడి మొదలైంది. కార్పొరేషన్‌ పరిధిలో పన్నుల వసూళ్ల నుంచి భవనాల అనుమతుల వరకు ఎక్కువ శాతం నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. కొన్ని భవనాలకు కార్పొరేషన్‌ పరిధిలోని మాస్టర్‌ ప్లాన్‌కు భిన్నంగా అనుమతులిస్తున్నారు. నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నరేందర్ ఏసీబీకు చిక్కడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Also Read : Haryana Government: హరియాణా పాఠశాలల్లో ‘గుడ్‌ మార్నింగ్‌’కు బదులు జైహింద్‌ !

Leave A Reply

Your Email Id will not be published!