PM Narendra Modi: 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని !
109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని !
PM Narendra Modi: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ(PM Narendra Modi) ముచ్చటించారు. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అభివృద్ధి చేసింది.
PM Narendra Modi….
అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ(PM Narendra Modi) సంభాషించారు. కొత్త వంగడాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. పౌష్టికాహారంవైపు ప్రజలు ఎలా మళ్లుతున్నారన్న విషయాన్ని తెలిపారు. చిరు ధాన్యాల ప్రాధాన్యతను, సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను, సేంద్రియ వ్యవసాయంపై సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ… 61 పంటలకు చెందిన 109 వంగడాలను విడుదల చేశామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. ఈ కొత్త వంగడాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.
ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు.
సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు.
సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.
Also Read : Minister Nadendla : రాబోయే రోజుల్లో ధాన్యం అమ్మిన సొమ్ము రైతులకు 48 గంటల్లో చెల్లిస్తాం