PM Modi : మహిళలపై నేరాలు చేస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి
దేశంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వారి బాధ, ఆగ్రహం తాను అర్థం చేసుకోగలనని అన్నారు...
PM Modi : మహిళలపై పెరుగుతున్న నేరాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కీలక ప్రకటన చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జలగావ్లో ఆదివారంనాడు జరిగిన ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తు్న్నామని చెప్పారు. దేశంలో గత రెండు వారాల్లో మహిళలపై అకృత్యాల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
PM Modi Comment
దేశంలోని మహిళల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వారి భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని, ఎర్రకోట నుంచి ఇదే అంశాన్ని తాను పలుమార్లు ప్రస్తావించానని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వారి బాధ, ఆగ్రహం తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు క్షమించరాని పాపమని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి చెప్పదలచుకున్నానని అన్నారు. మహిళలపై నేరాలకు ప్రోత్సహించే వారిని విడిచిపెట్టమని చెప్పారు. ఆసుపత్రి కావచ్చు, స్కూలు, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ కావచ్చు.. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వారిని కూడా జవాబుదారీగా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు వస్తాయి, వెళ్తుంటాయనీ, కానీ ప్రాణాలను కాపాడటం, మహిళల గౌరవాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని అన్నారు.
ఇటీవల కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ వెంటనే బద్లాపూర్ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. కాగా, ‘లఖ్పతి దీదీస్’ కార్యక్రమంలో ఏటా లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలతో మోదీ ముఖాముఖీ సంభాషించడంతో పాటు, 11 మందిని సన్మానించారు. రూ.5000 కోట్ల బ్యాంకు రుణాలను సైతం ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేశారు. ఇందువల్ల 25.8 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు లబ్ది పొందుతారు. మూడు కోట్ల మందిని లఖ్పతి దీదీలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : CM Revanth : అక్రమ కట్టడాలను వదిలేది లేదంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం