Minister Savitha : బీసీ హాస్టల్ లో ఇంటర్ విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి

విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి లింగమయ్య స్వగ్రామం నుంచి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు...

Minister Savitha: నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత(Minister Savitha) విచారణకు ఆదేశించారు. ఉరి వేసుకున్నట్లు హాస్టల్ అధికారులు, సిబ్బంది చెప్పడం.. యువకుడి మెడపై ఎలాంటి గాయాలు లేకపోవడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి సవిత(Minister Savitha) ఘటనపై పూర్తి విచారణ చేసి నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Minister Savitha Comment

కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన లింగమయ్య కుమారుడు తేజ అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బీసీ బాయ్స్‌ కాలేజీ హాస్టల్‌లో వసతిగృహంలో ఉంటున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సోమవారం సాయంత్రం హాస్టల్‌ బాత్‌రూమ్‌లో కడ్డీకి ఉరివేసుకున్నాడు. తేజ చాలా మంచివాడని, ఎవరితోనూ గట్టిగా మాట్లాడేవాడు కాదని తోటి విద్యార్థులు చెప్తున్నారు. వారం నుంచి అతడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు చెప్పారు. విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు తెలియడం లేదని హాస్టల్‌ వార్డెన్, బీసీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.

విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి లింగమయ్య స్వగ్రామం నుంచి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. బెడ్‌పై పడి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించాడు. ఏదో జరిగిందని, తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కన్నీరు మున్నీరయ్యాడు. న్యాయం చేయాలని అధికారులకు విన్నవించాడు. కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని నాలుగో పట్టణ సీఐ సాయినాథ్‌ చెప్పారు. విషయం తెలుసుకున్న ఏఐఎస్‌ఎఫ్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ సోమవారం రాత్రి నిరసనకు దిగాయి. విద్యార్థి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరో కొడుతున్నా హాస్టల్‌ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని మండిపడ్డారు. అధికారులు నిజానిజాలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. అయితే విద్యార్థి ఉరివేసుకున్నా గొంతుపై ఎలాంటి గాయాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి కాలిపై మొబైల్‌ నంబర్‌ ఉండగా.. దానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్‌ వస్తోంది.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య గురించి తెలుసుకున్న మంత్రి సవిత(Minister Savitha), జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. తేజ మృతదేహాన్ని పరిశీలించి.. హాస్టల్ విద్యార్థులు, సిబ్బందిని అడిగి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే తన కుమారుడి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ మంత్రి ఎదుట విద్యార్థి తండ్రి లింగమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉరివేసుకున్నాడని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారని, కానీ మెడపై ఎలాంటి గాయాలు లేవని ఆయన మంత్రికి వివరించారు. ఘటనపై విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కోరారు. విద్యార్థిని తండ్రిని పరామర్శించిన మంత్రి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించారు. తక్షణ సాయం కింద ప్రభుత్వం తరఫున మట్టి ఖర్చుల కోసం రూ.లక్ష అందజేశారు.

Also Read : CM Revanth Reddy : ఆ దీక్షలు మీ బావ, బావమరుదులు చేయొచ్చు కదా

Leave A Reply

Your Email Id will not be published!