Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో జోరుగా కురుస్తున్న వర్షాలు
యన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి...
Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తలెత్తింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Rain Alert in AP
యన్టీఆర్ జిల్లాలో నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నేడు అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మైలవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. మరోవైపు విజయవాడలోనూ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మ్యాన్ హోల్స్ నిండిపోవడంతో నీరు రోడ్లమీదకి చేరుకుంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట పరిసర ప్రాంతల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జేఎన్టీయూ కాలేజీలో వన మహోత్సవం ఏర్పాట్లు చేశారు. భారీ వర్షంతో కార్యక్రమానికి ఇక్కట్లు తలెత్తాయి. ఎక్కడికక్కడి బురదలో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. మరికొద్ది సేపట్లో సీఎం, డిప్యూటీ సీఎం లు బయలుదేరాల్సి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.
Also Read : PM Modi : దేశంలో ‘ఫిన్‌టెక్’ కంపెనీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన మోదీ