TG Govt : మెడికల్ అడ్మిషన్ల స్థానికత పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్

కాగా... తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే....

TG Govt : మెడికల్ అడ్మిషన్లకు స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు(High Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరఫు న్యాయవాది మెన్షన్ చేశారు. త్వరగా విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం(Supreme Court) వెల్లడించింది.

TG Govt…

కాగా… తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే.. రాష్ట్రంలో వైద్య విద్యకు స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై హైకోర్టు(High Court) గురువారం కీలక తీర్పునిచ్చింది. తెలంగాణలో శాశ్వత నివాసితులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంటూ.. ‘తెలంగాణ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌-2017’కు జీవో 33 ద్వారా ప్రభుత్వం తెచ్చిన సవరణ, రూల్‌ 3(ఏ)ని పునర్నిర్వచించింది. శాశ్వత నివాసులు కేవలం రెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటే.. స్థానికులు కాకుండా పోబోరని అభిప్రాయపడింది. శాశ్వత నివాసులైన విద్యార్థులను గుర్తించి, వారికి మెడిసిన్‌ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో వైద్యవిద్యలో అడ్మిషన్లకు ప్రభుత్వం 2017లో నిబంధనలను రూపొందించింది. అయితే.. విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగియడంతో.. ఆ నిబంధనలకు సవరణలను తీసుకొస్తూ.. సర్కారు జూలై 19న జీవో 33ని తీసుకువచ్చింది.

దీని ప్రకారం.. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ వరకు వరుసగా తెలంగాణ(Telangana)లో చదివిన వాళ్లే స్థానికులు అని రూల్‌ 3(ఏ)లో నిర్వచించింది. అయితే.. ఇంటర్‌తోపాటు నీట్‌ కోచింగ్‌, ఇతరత్రా కారణాల వల్ల వేరే రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ(Telangana) శాశ్వత స్థానికులైన విద్యార్థుల పాలిట ఈ నిర్వచనం శరాఘాతంగా మారింది. సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోవడంపై 130 మందికి పైగా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. 53 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ‘‘ తెలంగాణ స్థానికులమే అయినా.. కేవలం ఒకట్రెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు కాంపిటెంట్‌ కోటాలో 85ు సీట్లకు మమ్మల్ని అనర్హులుగా ప్రకటించడం చెల్లదు’’ అని కోర్టుకు వివరించారు.

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, ఎ. ప్రభాకర్‌రావు వాదనలను వినిపించారు. ‘‘ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల గడువు ముగియడంతో.. తెలంగాణ లోకల్‌ ఏరియాగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్థానికులకు స్థానిక కోటా సీట్లు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దాంతో రూల్స్‌ సవరించాం. తెలంగాణ(Telangana) శాశ్వత నివాసితులకే స్థానిక రిజర్వేషన్‌ దక్కడం రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం’’ అని పేర్కొన్నారు.

వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘‘ప్రభుత్వం సవరణ ద్వారా తీసుకొచ్చిన రూల్‌ 3(ఏ) ముఖ్యఉద్దేశం స్థానికులకు రిజర్వేషన్‌ కల్పించడం. ఈ నిబంధనను కొట్టివేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అర్హులవుతారు. ఇక్కడి శాశ్వత నివాసితులకు స్థానిక రిజర్వేషన్‌ దక్కకుండా పోతోంది. అందుకే.. ఈ నిబంధనను పునర్నిర్వచిస్తున్నాం. తెలంగాణ శాశ్వత నివాసులకు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన వర్తించదని అన్వయిస్తున్నాం.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 డీ(2), బీ(2)లో పేర్కొన్న ముఖ్య ఉద్దేశానికి అనుగుణంగానే.. ప్రభుత్వం తెచ్చిన నిబంధన 3(ఏ)ని నిర్వచిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. నీట్‌ విద్యార్థులు తెలంగాణలో శాశ్వత నివాసితులు అయితే.. ఆ మేరకు నివాస ధ్రువీకరణ పత్రాలుంటే.. వారు వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానిక కోటాకు అర్హులేనని స్పష్టం చేసింది. శాశ్వత నివాసితులను గుర్తించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు లేవని గుర్తుచేసింది. ఒక విద్యార్థిని ఏయే పరిస్థితుల్లో శాశ్వత స్థానికుడిగా పరిగణనలోకి తీసుకుంటారనే అంశాన్ని నిర్వచిస్తూ.. కొత్తగా నిబంధనలు లేదా మార్గదర్శకాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల మేరకు ప్రవేశాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Kinjarapu Rammohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌ గా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు !

Leave A Reply

Your Email Id will not be published!