PM Narendra Modi : జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మోదీ
మీకోసం, దేశం కోసం ఎన్నిసార్లు కష్టపడటానికైనా నేను సిద్ధంగా ఉన్నారు....
PM Narendra Modi : జమ్ముూకశ్మీర్ లో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని, శాంతి-సుస్థిరలతకు తాను భరోసాగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని శనివారంనాడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దోడా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఏళ్ల తరబడి జమ్మూకశ్మీర్‌లో పాలన సాగించిన కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్రం గణనీయంగా తీసుకువచ్చిన మార్పులను ప్రస్తావించారు. సంపన్న జమ్మూకశ్మీర్‌కు తాను గ్యారెంటీ ఇస్తున్నానని చెప్పారు.
” మీకోసం, దేశం కోసం ఎన్నిసార్లు కష్టపడటానికైనా నేను సిద్ధంగా ఉన్నారు. మనమంతా కలిసికట్టుగా సురక్షిత, అభ్యుదయ జమ్మూకశ్మీర్(Jammu Kashmir)ను నిర్మించుకుందాం. అందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఏ పార్టీలపై మీరు విశ్వాసం చూపించారో వారు మిమ్మల్ని పట్టించుకోలేదు. జమ్మూకశ్మీర్ యువత ఉగ్రవాదం కోరల్లో నలిగిపోయారు. మీరు నమ్ముకున్న పార్టీలు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఎంజాయ్ చేశాయి. జమ్మూకశ్మీర్‌లో కొత్త నాయకత్వాన్ని రాకుండా చేశారు” అని మోదీ(PM Narendra Modi) అన్నారు.
PM Narendra Modi Comment
కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రాజ్యమేలిందని, జమ్మూకశ్మీర్‌లో ఏళ్ల తరబడి వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేలా చేశారని ప్రధాని తప్పుపట్టారు. ఈ ఎన్నికలు జమ్మూకశ్మీర్‌లోని యువకులకు, మూడు కుటుంబాలకు మధ్య జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఆ మూడు కుటుంబాలు, మరో వైపు జమ్మూకశ్మీర్ యువత ఉన్నారన్నారు. ఒక కుటుంబం కాంగ్రెస్, తక్కిన రెండూ ఎన్సీ, పీడీపీ అని చెప్పారు. ఆ మూడు కుటుంబాలు ప్రజల పట్ల చేసిన పాపం అంతా ఇంతా కాదని, వేర్పాటువాదం, ఉగ్రవాదానికి అవసరమైన వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారని, ఇందువల్ల దేశానికి శత్రువులైన వారే లబ్ధి పొందారని అన్నారు.
ఇటీవల కొద్ది సంవత్సరాల్లో జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో తీసుకువచ్చిన మార్పులను ప్రధాని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం జమ్మూకశ్మీర్‌లో అంపశయ్యపై ఉండి తుదిశ్వాసతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. పోలీసులు, ఆర్మీపై ఒకప్పుడు విసిరిన రాళ్లు ఇప్పుడు జమ్మూకశ్మీర్ నిర్మాణానికి వినియోగస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా రిజర్వేషన్‌కు నోచుకోని పహాడి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించదన్నారు. ఈరోజు ఎంతో మంది తొలిసారి ఓటు హక్కుకు నోచుకున్నారని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని, కొందరు తమ జేబుల్లో రాజ్యాంగాన్ని పెట్టుకుని, 75 ఏళ్లుగా మీలో కొందరిని ఎలాంటి హక్కులకు నోచుకోకుండా చేశారని విమర్శించారు.
కాంగ్రెస్-పీడీపీ-ఎన్సీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు అమల్లోకి వస్తే జమ్మూకశ్మీర్ తిరిగి పాఠశాలలు తగులపెట్టడం, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతాయని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌లో ఉండే ప్రతి ఒక్కరూ కుల, మత బేధం లేకుండా బీజేపీ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు హక్కులకు తాను గ్యారెంటీగా ఉంటానని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని ప్రధాని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరుగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి. జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం విశేషం.
Also Read : Minister Satyakumar : మంచి విద్య, వైద్యం అందించాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి