Lalu Prasad Yadav : రైల్వే ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కేసులో లాలూకు మరో షాక్
ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 15న ఢిల్లీ కోర్టులో జరగనుండగా, 30 మందికి పైగా నిందితులు ఉన్నారు...
Lalu Prasad Yadav : రైల్వే ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కేసు విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. ఈ కేసులో లాలూ యాదవ్‌ను విచారించేందుకు సీబీఐకి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సీబీఐ ఛార్జిషీటుపై హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మిగిలిన నిందితులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి పొందడానికి సీబీఐ సిద్ధమైంది. దీంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఒకరోజు ముందే లాలూ కుటుంబానికి ఇబ్బందులు పెరిగాయి.
ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సహా ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 7న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విశేషమేమిటంటే లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తొలిసారిగా ఈ కేసులో కోర్టు నుంచి సమన్లు అందుకున్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.
Lalu Prasad Yadav Case..
ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 15న ఢిల్లీ కోర్టులో జరగనుండగా, 30 మందికి పైగా నిందితులు ఉన్నారు. ఇతర నిందితులను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐ హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు కూడా సమర్పించింది. త్వరలో వాటి ఆమోదం కూడా వస్తుందని దర్యాప్తు సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), ఆయన ఇద్దరు కుమారులు, మరో ఆరుగురు నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే సమన్లు జారీ చేశారు. ఇతర చార్జిషీట్ వ్యక్తులకు కూడా సమన్లు పంపారు.
కోర్టు తన సమన్లలో అఖిలేశ్వర్ సింగ్, ఆయన భార్య కిరణ్ దేవిని కూడా చేర్చింది. ఈడీ ఆగస్టు 6న 11 మంది నిందితుల జాబితాతో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరిలో నలుగురు మరణించారు. ఈ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 మధ్య కాలానికి సంబంధించినది. ఆయన హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే గ్రూప్ డీ పోస్టుల్లో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిగా లాలూ కుటుంబ సభ్యులు, ఇతర అనుచరుల పేరిట భూములను రిజిస్టర్ చేయించున్నారని సమాచారం. ఈ కేసులో క్రిమినల్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలూ లాలూ కుటుంబ సభ్యులను మళ్లీ విచారించనున్నాయి.
Also Read : Revanth Reddy : ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఉరటనిచ్చిన ధర్మాసనం