Rahul Gandhi : తిరుమల లడ్డు కల్తీ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ
ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది...
Rahul Gandhi : తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ చేయడంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఈ అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయన్నారు. కోట్లాది మంది భక్తులు కొలిచే దేవుడు తిరుమల శ్రీవారు అని పేర్కొన్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో తయారు చేసే ప్రసాదంలో కల్తీ జరగడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుందన్నారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి అవసరం ఉందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Comment
కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారంతో యావత్ ప్రపంచంలోని శ్రీవారి భక్తలు కలవరానికి గురవుతున్నారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం ఈ అంశంపై స్పందించి.. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తోంది. కల్తీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ నేపథ్యంలో ఈ కల్తీ అంశం ఎంత వరకు వెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
Also Read : Kolkata Doctor Case : నేటి నుంచి సమ్మె ముగించి విధుల్లో చేరనున్న జూనియర్ డాక్టర్లు