KTR : తెలంగాణ ప్రజలకు ఒకవైపు సాగునీటి సంక్షోభం రుణమాఫీ బాధలు
సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నల చేతిలో దండన తప్పదని అన్నారు...
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారని, కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారని, ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి సర్కారే కారణమని అన్నారు. ‘‘ ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం.. ఇంకోవైపు రైతు భరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం’’ అంటూ విమర్శించారు. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం నెలకొందన్నారు.
KTR Slams
వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదని.. ప్రభుత్వానికి బాధ్యత లేదని కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండగలా మార్చిందని.. సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నల చేతిలో దండన తప్పదని అన్నారు. ‘ అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి..! ముంచే రోజులు పోతాయ్..!! మళ్లీ మంచి రోజులొస్తాయ్’..!!! జై కిసాన్ అంటూ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. కాగా రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? … రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2500, అవ్వ, తాతలకు నెలకు రూ. 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? అని ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మూసీ సుందరీకరణ పేరిట రూ. లక్షన్నర కోట్లు లూటీకి తెరతీసిన ఘనుడు ఎవరు? అని ధ్వజమెత్తారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవాల్నా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : Home Minister Shah : మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి కీలక సమీక్ష