Minister Bhatti Vikramarka : ఇకపై ప్రపంచ స్థాయిలో విద్యార్థులకు విద్యాబోధన

బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు...

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి దసరా రోజున భూమిపూజ చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రత్యేక డిజైన్లు తయారు చేయించినట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన, క్రీడలు, సినిమా థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం సహా పలు వసతులతో భవనాల నిర్మాణం జరగబోతోందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇకపై ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాప్రమాణాలు ఉంటాయని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

Deputy CM Bhatti Vikramarka Comment

దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి(Bhatti Vikramarka) తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీల పిల్లలందరూ చదువుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ బిల్లులు రూ.114కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇకపై పిల్లల కాస్మోటిక్ ఛార్జీలను ఏ నెలకు ఆనెలే అందజేస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పూర్తిస్థాయిలో విడుదల చేశామని, ఇకపై అందరికీ ప్రతి నెలా జీతాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు అన్నీ త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. దసరా కంటే ముందే అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. మరోవైపు దసరా సందర్భంగా రైతులకు ఆయన శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అడిగిన రైతుకల్లా ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ పోల్స్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు భట్టి వెల్లడించారు. కావాల్సిన రైతులు 1912కు ఫోన్ చేసి సమస్యపై ఫిర్యాదు చేయాలని కోరారు.

బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లాంటి వాళ్లు పదేళ్లపాటు అబద్ధాలు చెప్పిచెప్పి తమ లాగే అందరూ ఉంటారని అనుకుంటున్నారు. మూసీపై క్యాబినెట్‌లో చర్చించే నిర్ణయం తీసుకున్నారా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, చర్చ లేకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటామని భట్టి(Bhatti Vikramarka) మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్‌ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అలాగే ఉంటుందని జగదీశ్ రెడ్డి అపోహపడుతున్నారని భట్టి విమర్శించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజాస్వామ్య ప్రభుత్వమని డిప్యూటీ సీఎం చెప్పారు. మూసీని శుద్ధి చేసి హైదరాబాద్ నడిబొడ్డున స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా సుందరీకరణ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, ఆ పార్టీ నేతలకు కమిట్మెంట్ లేదని భట్టి ఆరోపించారు. మూసీని సుందరీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మూసీ నిర్వాసితులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనీయబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి(Bhatti Vikramarka) స్పష్టం చేశారు. వారికి నివాసాలు ప్రభుత్వం నిర్దేశించిన చోట ఏర్పాటు చేస్తే జగదీశ్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెద్దల్లా తాము ఎవరినీ కలవనీయకుండా గడీలలో లేమని ఎద్దేవా చేశారు. సలహాలు ఇవ్వాలంటే తమ ఎదుటకు వచ్చి ఇవ్వొచ్చని చెప్పారు. పచ్చ కామెర్లు ఉన్న వాళ్లకు లోకమంతా పచ్చగా కనపడుతుందని, బీఆర్ఎస్ నేతలు మాటలూ అలాగే ఉన్నాయంటూ భట్టి ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు ఖర్చంటూ ప్రచారం చేస్తున్నారని, అసలు అంత ఖర్చు చేస్తు్న్నట్లు ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. పనులకు సంబంధించి ఇంకా డీపీఆరే సిద్ధం కాలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని హితబోద చేశారు. మరోవైపు ఇటీవల వచ్చిన భారీ వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు భట్టి తెలిపారు. వరదల సమయంలో రేయింబవళ్లు కష్టపడి సేవలందించిన విద్యుత్ శాఖ సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి అభినందించారు.

Also Read : Minister Satyakumar : ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు వినతినిచ్చిన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!