TG DGP : గ్రూప్ -1 అభ్యర్థులకు తెలంగాణ డీజీపీ ఘాటు వార్నింగ్

మరోవైపు నగరంలోని అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది...

TG DGP : రాష్ట్రంలో గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మరోవైపు జీవో 29ను రద్దు చేయాలంటూ నిరుద్యోగుల ఆందోళనలు మిన్నంటాయి. పలు చోట్ల నిరుద్యోగులు నిరసనలకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు డీజీపీ జితేందర్(TG DGP) వార్నింగ్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలను రక్షించాలనే నిన్న (శుక్రవారం) వారి (గ్రూప్ -1 అభ్యర్థులు) ఆందోళన అరికట్టామని అన్నారు. సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టు కు వెళ్ళాలి కానీ రోడ్ల మీద ఆందోళన చేస్తే ఊరుకోమంటూ డీజీపీ(TG DGP) జితేందర్ హెచ్చరించారు.

TG DGP Comment

మరోవైపు నగరంలోని అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 29 రద్దు కోసం నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. జీవో నెం 29ను రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగ యువతీయువకులు ఇచ్చిన ఆందోళనకు నిరుద్యోగ యువతతో పాటు బీజేపీ పార్టీ శ్రేణులు కూడా తరలివచ్చారు. అశోక్‌నగర్ నుంచి ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పెద్దఎత్తున నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని బండిసంజయ్ స్పష్టం చేశారు.

అశోక్‌నగర్‌ నుంచి వందలాది మంది యువతీ యువకులు సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. జీవో నెం 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం ప్రకటించని నేపథ్యంలో సర్కార్ వైఖరికి నిరసనగా తమ ఆందోళన కొనసాగుతుందని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఓ వైపు నిరుద్యోగులు, మరోవైపు బీజేపీ పార్టీ శ్రేణుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు, బండి సంజయ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సెక్రటేరియట్‌ను ముట్టడి చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్.. అశోక్‌నగర్‌ చేరుకుని అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు.

Also Read : MP CM Ramesh : వైసీపీ నేతల అక్రమాలపై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!