Minister Ram Mohan : సీఎం శ్రీకాకుళం పర్యటనపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి రామ్ మోహన్ నాయుడు

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు...

Ram Mohan : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా ముఖ్యమంత్రి అని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చాలా నిరాడంబరంగా జరిగిందని ఆయన తెలిపారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

Minister Ram Mohan Naidu Comment

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan) ఆదివారం శ్రీకాకుళంలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన దిగ్విజయం అయిందన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పారు.

ఒక ముఖ్యమంత్రి.. జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించటం గత చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా లేదన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన వివరించారు. ఈ సందర్బంగా జిల్లా సమస్యలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ జిల్లాలో గత ఐదేళ్లలో నీటి పారుదల వ్యవస్థను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ కేంద్రమంత్రి మండిపడ్డారు.

జిల్లాలోని వంశధార పేజ్-2 ద్వారా 90 టీఎంసీ నీటిని అందుబాటులోకి తేవటానికి చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని నదులను అనుసంధానం చేయటానికి గతంలోనే ఓ ప్రయత్నం చేశామన్నారు. అయితే నదులు అనుసంధాన ప్రాజెక్ట్‌లో భాగంగా అసంపూర్తిగా ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ సమావేశంలో ఆదేశించారని ఆయన తెలిపారు.ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కొత్త డిపిఆర్ తీసుకుని వాటి పనులు చేపట్టడానికి సీఎం అంగీకరించారన్నారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వలసలు నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకోసం మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. ఇక మూలపేట పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామికాభివృద్ధి సైతం చేపట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. అందుకోసం మూలపేట సమీపంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన అరసవెల్లి అభివృద్ధికి సైతం చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. గ్లోబల్ స్టాండర్డ్స్ స్థాయిలో ఈ దేవాలయం అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఈ ఆలయాభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్‌లో భాగంగా చేపడతామని వివరించారు. ఇక జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు సైతం తీసుకుంటామని ఆయన జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లాలో విస్తృతమైన ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సైతం జిల్లాకు ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు(Ram Mohan) తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకే సారి జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి వస్తే.. ఉచిత సిలిండర్‌తోపాటు మరో ఐదు పథకాలు అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ మ్యానిఫెస్టోలో ‘సూపర్ సిక్స్’ పేరిట ఈ పథకాలను ఆ పార్టీ పొందు పరిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం లబ్దిదారుడి నివాసంలో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. అనంతరం ఈ టీని అందరు తాగారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడితోపాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడం పట్ల.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం పైవిధంగా స్పందించారు.

Also Read : MP Mithun Reddy : పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి హాజరైన వైసీపీ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!