CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది
ఏజెన్సీని మార్చి, ఆఫీసర్లను మార్చి రెండు సంవత్సరాలు పట్టించుకోలేదని....
CM Chandrababu : ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడాని చైతన్యంతో ఓట్లు వేశారన్నారు. 13.5శాతం గ్రోత్ గతంలో సాధించామని తెలిపారు. ‘‘2019లో ఒక్కఛాన్స్ అనేమాట చెప్పి అధికారంలోకి వచ్చారు.. నాకు నాలుగు అయిదు నెలలు పట్టింది. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కవ విధ్వంసం జరిగింది’’ అని తెలిపారు.
CM Chandrababu Slams..
జీవోలు పెట్టలేదని, సీఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ అయిదు సంవత్సరాలు ఎక్కవ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. అసమర్ధ పాలన, అభివృద్ది నిరోధక నిర్ణయాలు, ప్రజాసంపద దోపిడీ, పన్నుల బాదుడు, స్కాములు కోసమే స్కీములు తెచ్చారని విమర్శించారు. అమరావతి నిర్మాణం ఆపారని.. బ్రాండ్‌ను దెబ్బతీశారన్నారు. పోలవరాన్ని పూర్తిచేసి నదులు అనుసంధానం చేయాలి అంటే పట్టించుకోలేదన్నారు.
ఏజెన్సీని మార్చి, ఆఫీసర్లను మార్చి రెండు సంవత్సరాలు పట్టించుకోలేదని.. దీంతో డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయిందన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి అవకాశాలు పోయాయన్నారు. విద్యుత్ రంగంలో లక్ష 29వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని వెల్లడించారు. 9వేల కోట్లు కరెంటు వాడుకోకుండా వారికి బకాయిలు కట్టారన్నారు. 7. 25 పైసలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కరెంట్ కొన్నారన్నారు. ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఎలా వెంటాడుతాయో దీనికి ఉదాహరణ అని అన్నారు. ఇసుకపైనా వ్యాపారం చేశారని.. దోపిడీ చేశారని ఆరోపించారు. రూ.30 వేల కోట్లు ఇసుకలో దోపిడీ చేశారన్నారు. మద్యంలో ఇలా కూడా చేయొచ్చు అని మొదటి సారి చూశానన్నారు. వీళ్లదే మ్యానుఫ్యాక్చరింగ్, వీరే రవాణా, వీరే అమ్మారన్నారు.
మద్యం షాపుల్లో ఆన్లైన్ లేదని.. సాయంత్రానికి ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు రావాలన్నారు. మొన్నటి వరకూ సైకో బ్రాండ్ దొరికిందని… ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 57 శాతం ఓట్లతో ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. 1994 ఆర్ధిక మంత్రిగా తాను చేసిన బడ్జెట్ ప్రసంగంలోని ప్రకటన 30 ఏళ్ల తర్వాత పరిస్థితులకు తగినట్టుగా నిజమైందన్నారు. ఇప్పుడు తెలంగాణా అగ్రస్థానంలో ఉందంటే దానికి కారణం టీడీపీ(TDP) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన ఏపీ(AP)కి తీవ్ర కష్టనష్టాలను మిగుల్చిందని.. కరెంటు ఛార్జీలు పెంచకుండా కొరత నుంచి మిగులు విద్యుత్ సాధించగలిగామన్నారు. రాజధాని కూడా లేకుండా ఉన్న రాష్ట్రానికి అమరావతి నిర్మాణం కోసం ప్రణాళికలు చేశామన్నారు. జీవోలు కూడా ఆన్లైన్లో లేకుండా గుట్టుగా పాలన చేశారని మండిపడ్డారు.
రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయినా మాకు ఓ టీవీ,పత్రిక లేవని.. అవినీతి అక్రమాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వారు.. వస్తూనే టీవీ, పత్రిక పెట్టుకుని పార్టీ పెట్టుకున్నారని విమర్శించారు. రైతు బజార్లు, తహసిల్దారు కార్యాలయాలను, హెల్త్ సెంటర్లను తాకట్టు పెట్టేశారన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయకుండా కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రూ.4500 కోట్లతో 30 వేల పనులు సంక్రాంతికే పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చెబుతున్నారన్నారు. జల్ జీవన్ మిషన్‌ను పూర్తిగా వినియోగించుకోకుండా నిలిపేశారని తెలిపారు.
ఆ ప్రాజెక్టు ఉంటే ఇంటింటికీ కుళాయి వచ్చి సురక్షితమైన తాగునీరు అందరికీ అందేదన్నారు. ఉత్తర ప్రదేశ్ 1 లక్ష కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్‌తో తాగునీరు ఇస్తోందన్నారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టారని.. ఆయనే తొలిసారిగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 9,74,556 కోట్లుగా ఇప్పటికి తేలిందన్నారు. ఇప్పుడు తలసరి అప్పు 1.44 లక్షలుగా ఉందన్నారు. ‘‘ మా ప్రభుత్వం ఏదీ దాచటం లేదు అందుకే అన్ని జీవోలనూ బహిర్గతం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఆన్ లైన్లో పెడుతున్నాం.
ఇసుక మేం ఉచితంగా ఇస్తే వైసీపీ(YCP) టన్నుకు 475 రూపాయలు వసూలు చేసింది. వైసీపీ()YCP హయాంలో వ్యక్తిగత ఆదాయం పెరిగి రాష్ట్ర ఆదాయం కూడా తగ్గింది. వ్యవసాయంలో వృద్ధి టీడీపీ(TDP) హయాంలో 16 శాతానికి పైగా ఉంటే వైసీపీ వచ్చాక 10 శాతానికి తగ్గింది. ఇలా అన్ని వ్యవస్థలూ కలిపి వృద్ధి రేటు 10.6 శాతానికి పడిపోయింది. ఐదేళ్ల కాలంలో 6.94 లక్షల కోట్ల మేర రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. తలసరి ఆదాయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపీ(AP) 1.14 లక్షల మేర తక్కువ ఉంది. అమరరాజా బ్యాటరీస్ లాంటి కంపెనీ ఏపీ(AP) నుంచి వెళ్లిపోయి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. ఏపీ అంటే అపనమ్మకం ఏర్పడి పరిశ్రమలు ఎవరూ రాలేదు. 25 వేల కేసుల్లో సీఎస్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఇలా ప్రభుత్వ కార్యదర్శులు హైకోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. బటన్ నొక్కాలి కాబట్టి అప్పులు తెచ్చారు. ఒక విష వలయంలా అంతా మార్చేశారు.
ఆ పరిస్థితుల్ని వివరించేందుకే 7 శ్వేతపత్రాలను విడుదల చేశాం’’ అని తెలిపారు. ‘‘ రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. దాన్ని మళ్లీ పునర్నిర్మించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఆరు విధానాలు తీసుకువచ్చాం. పేదలు అన్నం తినే అన్నా క్యాంటీన్లను కూడా నిలిపేశారు. అందుకే 200కు పైగా క్యాంటీన్లను తిరిగి తెరిచాం. మద్యం, ఇసుక విధానాల్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత శాసనసభ్యులు తీసుకోవాలి. రాజకీయ ముసుగులో నేరం చేస్తే వారి ముసుగు తీసేసి శాంతిభద్రతలు కాపాడతాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పట్టాలు ఎక్కాయి. వంశధార -గోదావరి -పెన్నా నదుల అనుసంధానం ద్వారా కరవు లేకుండా చేస్తాం . ఉచిత గ్యాస్ సిలెండర్ నేరుగా ఇచ్చేలా కార్యాచరణ చేస్తున్నాం. ప్రజల భవిష్యత్ కోసమే పెట్టుబడుల్ని తీసుకువస్తున్నాం.
అనుమానాలు వదిలేయాలని పారిశ్రామిక వేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. అయినా చెత్త పన్ను వసూలు చేశారు. రాష్ట్రంలోని రహదారులపై ప్రతీ కిలోమీటరుకూ వందల సంఖ్యలో గుంతలు ఉన్నాయి. వాటిని పూర్తిగా మరమ్మత్తు చేసేందుకు నిధులు మంజూరు చేశాం. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. కల్లు గీతకార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు రిజర్వు చేసింది కూటమి ప్రభుత్వమే అని తెలిపారు. అర్చకులకు వేతనాలు పెంచాం, వేదవిద్య చదివిన విద్యార్ధులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామన్నారు. ఒక వ్యక్తి అధికారంలో ఉండి చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలంతా ట్రూఅప్ కింద విద్యుత్ బిల్లులపై అదనపు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇప్పుడు మళ్లీ ఆ వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రజాస్వామ్యమే సిగ్గుపడేలా పోలీసు వ్యవస్థను వినియోగించారన్నారు. కరోనా సమయంలో మాస్కు ఇవ్వమని కోరిన సుధాకర్ అనే వైద్యుడ్ని వేధించి పిచ్చివాడిని చేశారని అన్నారు. ఆరు నెలల పాటు వివిధ శాఖల్లో తవ్వితే రూ. 9.74 వేల కోట్ల అప్పులు తేలాయని చెప్పారు. అడవి పందులు 10 శాతం పంటను తిని మిగతా 90 శాతం పంటను నాశనం చేస్తాయి. ఆ తరహాలోనే ఏపీ(AP)లోనూ అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేశారు అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలు నమ్మి ఓటేసినందుకు దుర్మార్గంగా పాలన చేశారన్నారు. సంపద సృష్టించేందుకు ఒక్క పనిని, ప్రాజెక్టును కూడా చేపట్టలేదని.. పెట్టుబడుల కోసం వస్తే పారిశ్రామిక వేత్తలను కూడా తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోవాలని చాలా మంది చెప్పారన్నారు.
రూ.430 కోట్ల ప్రజాధనంతో రుషి కొండ ప్యాలెస్ కట్టేసుకున్నారని.. పర్యావరణ విధ్వంసం చేసి కుటుంబ సభ్యుల కోసం కూడా ప్యాలెస్‌లు, ఆఫీస్‌లు కట్టేశారన్నారు. ఎన్జీటీకి, హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు కూడా వైసీపీ(YCP) ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. 700 కోట్లతో సర్వేరాళ్లు, పుస్తకాలు సొంత బొమ్మలేసుకుని దుర్వినియోగం చేశారన్నారు. ఇప్పుడు ఆ బొమ్మలు తీయటానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో సైకోలను కూడా తయారు చేశారని.. కన్న తల్లిపైన కూడా పోస్టులు పెట్టి ఆమె శీలాన్ని కూడా శంకించేలా సామాజిక మాధ్యమాల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ నేతలు ఎవరూ ఆలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టరన్నారు.
రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ అవమాన పడేందుకు వీల్లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టటం వ్యవస్థీకృత నేరంగా మారిపోయిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. కాగా.. బడ్జెట్‌పై ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ వెళ్లేందుకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Also Read : Minister Tummala : రైతులను ఇబ్బంది పెట్టే రాజకీయ క్రీడను పార్టీలు మానుకోవాలి