Deputy CM Bhatti : బీఆర్ఎస్ నేతలకు చర్చకు సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి
రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క మాటనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు...
Deputy CM Bhatti : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్(BRS) నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని భట్టి(Deputy CM Bhatti) ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో రూ.7,11,911 కోట్ల అప్పులను తెలంగాణ ప్రజలకు మిగిల్చారని భట్టి ఆరోపించారు. వారి హయాంలో చేసిన అప్పులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.
Deputy CM Bhatti Challenges..
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మీరూ అప్పులు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అంటున్నారు, వాళ్లు దోచుకోటానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు. పదేళ్లపాటు దోచుకున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు తమ ప్రభుత్వంపై నేడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను పట్టించుకోలేదు కాబట్టే నేడు అవి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని భట్టి మండిపడ్డారు.
రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క మాటనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రైతులు ధాన్యం పండించారని వాటిని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఒక పక్క బీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతూనే మరో పక్క రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నేతలు రైతు బీమా పదేళ్లపాటు కుట్టకుండా వదిలేశారని, తాము ప్రతి ఒక్క రైతుకూ బీమా కట్టినట్లు చెప్పుకొచ్చారు. రైతు రుణమాఫీ కాకుండా రూ.30 వేల కోట్లు ఇప్పటికి వరకూ ఖర్చు చేసినట్లు భట్టి వెల్లడించారు.
రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ప్రతి నెలా రూ.11,270 కోట్ల బిల్లులు కడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యుత్ బిల్లులు కట్టకుండా వదిలేశారని, నిబద్ధత కమిట్మెంట్తో తాము పని చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. డిసెంబర్ 28న భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు అందజేయబోతున్నట్లు భట్టి వెల్లడించారు. వారిలా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తాము మాట్లాడమని అన్నారు. వారు తమ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాసినంత మాత్రానా ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రతి ఇంటికీ రూ.5 లక్షలు ఇవ్వబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.
Also Read : CM Chandrababu : 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది